రిమ్స్‌లో కాన్పు కష్టాలు 

Pregnant Womens Suffering In Hospitals - Sakshi

మత్తు డాక్టర్లు లేక నిలిచిన శస్త్రచికిత్సలు 

తల్లడిల్లుతున్న గర్భిణులు

ఆదిలాబాద్‌ టౌన్‌: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌)లో అనస్తీషియా వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ప్రసవం కోసం చేరిన గర్భిణులు పురుటి నొప్పులతో అవస్థలు పడుతున్నారు. ప్రస్తుతం రిమ్స్‌ ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులో 58 మంది గర్భిణులు ఉన్నారు. శుక్రవారం అనస్తీషియా (మత్తు) వైద్యులు విధులకు హాజరు కాకపోవడంతో ప్రసవాలు నిలిచిపోయాయి. అత్యవసరంగా ఏడుగురికి కాన్పులు జరగాల్సి ఉన్నా వైద్యులు స్పందించలేదు.

దీంతో ముగ్గురిని వారి కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మరో నలుగురు గర్భిణులు నొప్పులతో అవస్థలు పడుతూ ఆస్పత్రిలోనే ఉండిపోయారు. కాగా, దీనిపై ఆస్పత్రి ఇన్‌చార్జి డైరెక్టర్‌ కరుణాకర్‌ను సంప్రదించగా, ముగ్గురు మత్తు వైద్యులకు గాను ఇద్దరు అనారోగ్య కారణాలవల్ల సెలవులో ఉన్నారని, మరో వైద్యురాలు నైట్‌ డ్యూటీలో ఉన్నారని తెలిపారు.  

పెద్ద ప్రాణానికి ఏమవుతుందో: షౌకత్‌ 
మాది నార్నూర్‌ మండల కేంద్రం. గర్భిణి అయిన నా భార్య హసీనాకు కడుపు నొప్పి రావడంతో గురువారం రిమ్స్‌కు తీసుకొచ్చాను. ఆస్పత్రిలో స్కానింగ్‌ చేయించాము. కడుపులోనే పిండం చనిపోయిందని వైద్యులు చెప్పారు. చనిపోయిన పిండాన్ని డాక్టర్లు ఆపరేషన్‌ చేసి ఇంకా బయటకు తీయలేదు. ఎప్పుడు ఆపరేషన్‌ చేస్తారని అడిగితే మత్తు డాక్టర్‌ ఎప్పుడు వస్తే అప్పుడే అని వైద్య సిబ్బంది  చెబుతున్నారు. దీంతో పెద్ద ప్రాణానికి ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top