కూల్చే కుట్ర కేసీఆర్‌దే | Ponguleti Srinivas Reddy in a special interview with Sakshi | Sakshi
Sakshi News home page

కూల్చే కుట్ర కేసీఆర్‌దే

Apr 17 2025 12:40 AM | Updated on Apr 17 2025 12:40 AM

Ponguleti Srinivas Reddy in a special interview with Sakshi

రూ.5–6 వేల కోట్లతోమా ఎమ్మెల్యేలను కొనే ప్లాన్‌

కేసీఆర్‌ కుటుంబంఎన్ని స్కెచ్‌లు వేసినా మా ముందు చెల్లవు

ధరణి చట్టమే బీఆర్‌ఎస్‌కు ఉరి తాడైంది 

మేం బాగా పని చేస్తున్నందుకే మోదీ విమర్శిస్తున్నారు 

భూభారతి పైలట్‌ మండలాల్లోనేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ 

మే 1 నుంచి భూ సమస్యల పరిష్కారం 

జూన్‌ 2 నాటికి వీలైనన్ని సమస్యలు పరిష్కరిస్తాం 

జీపీవోలు వచ్చిన తర్వాతే సర్వేమ్యాప్‌ నిబంధన అమలు 

ఈ ఏడాది చివరికల్లా కొత్త భూభారతి పోర్టల్‌ 

జూన్‌ 2న సీఎం చేతుల మీదుగా పేదలకు భూ పట్టాలు

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టాలన్న ఆలోచన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌దేనని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి నోటి వెంట వచ్చినవి కేసీఆర్‌ మనసులోని మాటలేనని ఆరోపించారు. రూ.5–6 వేల కోట్లు ఖర్చు చేసైనా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని కుట్ర చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. భూభారతి చట్టం అమల్లోకి వచ్చిన సందర్భంగా ఆ చట్టం తీరుతెన్నులు, రెవెన్యూ శాఖలో చేపడుతున్న సంస్కరణలు, రాష్ట్ర రాజకీయాలపై బుధవారం ‘సాక్షి’కి ఆయన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. 

‘భూభారతి చట్టంపై బీఆర్‌ఎస్‌ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అసలు వారికి ఉరితాడు అయింది ధరణినే. అది గ్రహించకుండా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. వారికి గత ఎన్నికల్లో వచ్చినన్ని సీట్లు కూడా ఈసారి రావు. 15 నెలలకే ప్రభుత్వాన్ని కూలుస్తామని కొందరి ఆత్మలు మాట్లాడుతున్నాయి. కేసీఆర్‌ మనసులోని మాటలనే దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. రూ.5–6 వేల కోట్లు ఖర్చుపెట్టి అయినా ఎమ్మెల్యేలను కొనాలని అనుకుంటున్నారు. కేసీఆర్‌ అధికారంలో ఉన్నన్ని రోజులు తనకు కావాల్సిన బిల్డర్లకు వేలాది ఎకరాలు కట్టబెట్టారు. 

ఇప్పుడు వారంతా భయభ్రాంతులకు గురై, ఫామ్‌హౌస్‌కు వెళ్లి మాజీ సీఎంకు మొరపెట్టుకున్న మాటలను ప్రభాకర్‌రెడ్డితో చెప్పించారు. ప్రభుత్వ భూములను చెరపట్టిన వారు ఏడేడు లోకాల ఆవల ఉన్నా వదిలిపెట్టం. ప్రతి ఇంచు భూమిని బరాబర్‌ తీసుకుని పేదలకిస్తాం. మాజీ సీఎం, ఆయన కొడుకు, అల్లుడు, కూతురు వేసే స్కెచ్‌లు, కుట్రలకు ఎలా చెక్‌పెట్టాలో కాంగ్రెస్‌ పార్టీ పులులకు తెలుసు. సమయం వచ్చినప్పుడు ఆ పులులు స్పందిస్తాయి’ అని స్పష్టంచేశారు.

కంచ గచ్చిబౌలి భూముల విషయంలో ప్రభుత్వానికి స్పష్టత ఉందని, కోర్టు ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపారు. ‘పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లు వేస్తారు. మేం మంచిగా పనిచేస్తున్నందుకే కంచ గచ్చిబౌలిపై మోదీ కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. 

నేటి నుంచే భూ సమస్యల పరిష్కారం
రాష్ట్ర ప్రజల కోరిక మేరకే ధరణిని బంగాళాఖాతంలో కలిపేశా మని మంత్రి పొంగులేటి చెప్పారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం భూభారతి చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్లు తెలిపారు. జూన్‌ 2వ తేదీ నాటికి వ్యవసాయ భూముల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో వీలైనన్ని పరిష్కరిస్తా మని వెల్లడించారు. భూభారతి చట్టం ద్వారా వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కరించే పనిని గురువారం నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ‘పైలెట్‌ ప్రాజెక్టుగా లింగంపేట, నేలకొండపల్లి, మద్దూరు, వెంకటాపూర్‌ మండలాలను ఎంచుకున్నాం. 

ఈ మండలాల్లోని అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహిస్తాం. ఈ సదస్సుల్లో రైతుల నుంచి భూసమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తాం. ఈ దరఖాస్తు ఫార్మాట్‌ను ఇప్పటికే క్షేత్రస్థాయికి పంపాం. ప్రతి గ్రామంలో తహసీల్దార్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం పర్యటించి, ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సదస్సులు నిర్వహిస్తుంది. స్వీకరించిన దరఖాస్తులను వెంటనే కంప్యూటరైజ్‌ చేస్తాం. ఈ నెలాఖరుకల్లా ఆ 4 మండలాల్లోని అన్ని గ్రామాల్లో సదస్సులు పూర్తవుతాయి. 

ఆ 4 మండలాలతోపాటు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు రైతులతో సదస్సులు నిర్వహిస్తారు. అక్కడ కూడా దరఖాస్తులు తీసుకుంటాం. మే మొదటివారంలో 28 జిల్లాల్లో ఒక్కో మండలాన్ని మోడల్‌గా తీసుకుని, ఆయా మండలాల్లోని అన్ని గ్రామాల్లో సదస్సులు నిర్వహించి, రైతుల సమస్యలను పరిష్కరిస్తాం. జూన్‌ 2వ తేదీకల్లా అన్ని జిల్లాల్లో వీలైనన్ని ఎక్కువ సమస్యల పరిష్కారమే మా లక్ష్యం. 

ఈ సదస్సుల ద్వారా పెండింగ్‌లో ఉన్న 9.6 లక్షల సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం కూడా జరుగుతుంది. ప్రభుత్వ భూములను ఆక్రమించిన పేదలను గుర్తించి వారికి పట్టాలిస్తాం. జూన్‌ 2న సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా ఈ పట్టాల పంపిణీ జరుగుతుంది. జూన్‌ 2 తర్వాత రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది’ అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

జీపీఓలు వచ్చాకే సర్వేమ్యాప్‌లు
రాష్ట్రంలో గ్రామ పాలనాధికారులను నియమించిన తర్వాతే సర్వే మ్యాప్‌లను అమల్లోకి తెస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘రిజిస్ట్రేషన్‌ సమయంలోనే ఆ భూమి హద్దులతో కూడిన సర్వేమ్యాప్‌ కూడా అందించాలన్న నిబంధనను ఇప్పటికిప్పుడు అమల్లోకి తెచ్చే ఉద్దేశం లేదు. రాష్ట్రంలోని 10,956 రెవెన్యూ గ్రామాలకు గ్రామ పాలనాధికారులు (జీపీఓ) వస్తారు. 6 వేల మంది లైసెన్సుడ్‌ సర్వేయర్లు కూడా వస్తారు. 

ఆ తర్వాత సర్వే మ్యాప్‌ నిబంధన ప్రారంభమవుతుంది. ఈలోపు రైతులు ఎవరైనా స్వచ్ఛందంగా కోరుకుంటే వారి పాస్‌పుస్తకంలో సర్వే మ్యాప్‌ ముద్రిస్తాం. కర్ణాటకలో 9 ఏళ్లుగా ఈ సర్వే మ్యాప్‌ నిబంధన అమలవుతోంది. ఇప్పటివరకు 75 శాతం భూములకు  మ్యాప్‌ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణలో అంతకంటే తక్కువ సమయంలో ఎక్కువ భూములకు సర్వే మ్యాప్‌లు వస్తాయి. 

జీపీఓల నియామకం విషయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాకు లేదు. ఏం చేసినా ప్రజల సౌలభ్యం కోసమే. వ్యవస్థ కోసం అందరూ సహకరించాలి.  పూర్వ వీఆర్వోలు, వీఆర్‌ఏలు గూగుల్‌ ఫామ్‌ ద్వారా ఆప్షన్లు ఇచ్చే గడువును పొడిగిస్తున్నాం’ అని ప్రకటించారు.

కొత్త పోర్టల్‌ తెస్తాం
ఇప్పుడు తెచ్చిన భూభారతి పోర్టల్‌ తాత్కాలికమేనని మంత్రి పొంగులేటి తెలిపారు. ‘భూ సమస్యల శాశ్వత పరిష్కారం ఈ పోర్టల్‌తో కాదు. అందుకే శాశ్వత పోర్టల్‌ను తీసుకురాబోతున్నాం. మరో వందేళ్ల పాటు భూభారతి పోర్టల్‌ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. త్వరలోనే టెండర్లు పిలుస్తాం. కొత్త పోర్టల్‌ తయారీకి 7–9 నెలలు పడుతుంది. ఈ ఏడాది చివరికి లేదంటే వచ్చే ఏడాది ప్రారంభం నాటికి పోర్టల్‌ అందుబాటులోకి వస్తుంది’ అని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement