Photo Story: కడుపు మంట.. కన్నుల పంట

Photo Story: Farmers Struggle Khammam, Paddy Procurement Siddipet - Sakshi

ధాన్యపు రాశులు ఒక వైపు... దీన గాథలు మరో వైపు. వ్యవసాయం జూదాన్ని తలపిస్తోంది. కొన్ని పంటలు అన్నదాతలకు నష్టాలు మిగులుస్తుంటే.. కొన్ని పంటలు రైతులకు లాభాల్ని ఆర్జించిపెడుతున్నాయి. 


కడుపు మంట

రఘునాథపాలెం: మిరప సాగు చేస్తే మంచి లాభాలు వస్తాయన్న ఆ రైతు ఆశలు అడియాశలయ్యాయి. తెగుళ్ల కారణంగా  కాపు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన రైతు మిరప తోటను  దున్నేశాడు. ఖమ్మం జిల్లా రఘునాథ పాలెం మండలం సూర్యా తండాకు చెందిన రైతు అంగ్రోత్‌ మత్రు గత ఏడాది మిర్చి క్వింటాకు రూ.15 వేల ధర పలకడంతో ఈసారి కూడా 2 ఎకరాల్లో సాగు చేశాడు. ఎకరానికి దాదాపు రూ.80 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. తీరా కాపు దశకు చేరాక గుబ్బ రోగంతో  కాయ ముడుచుకు పోయింది. దీంతో తోటకోసం చేసిన అప్పు తీర్చేందుకు కూరగాయలు సాగు చేయాలని నిర్ణయించుకున్న మత్రు, పంటను  సోమవారం ట్రాక్టర్‌తో దున్నేశాడు. మండలంలో మిర్చి తోటలను వైరస్‌ ఆశించిందని వ్యవసాయాధికారి తెలిపారు.


కన్నుల పంట

గోదావరి జలాలు జిల్లా వ్యాప్తంగా పుష్కలంగా అందటంతో నేల బంగారు సిరులను కురిపించింది. జిల్లాలో దాదాపు 2,28,436 ఎకరాలలో అన్నదాతలు వరిపంట సాగు చేశారు. ప్రకృతి కూడా కరుణించడంతో ఈసారి అధిక దిగుబడి వచ్చింది. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మార్కెట్‌లతోపాటు ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిండుగా దర్శనమిస్తోంది. సిద్దిపేట మార్కెట్‌ ధాన్యరాశులతో ఇలా కళకళలాడుతోంది.
– స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top