తాళాలు పగులగొట్టి.. ‘గృహప్రవేశం’.. అటువైపు కన్నెత్తి చూడని అధికారులు, ప్రజాప్రతినిధులు

People Breaks Lock And Entered Into Double Bedroom Houses In Nizamabad District - Sakshi

కోటగిరి (బోధన్‌): డబుల్‌బెడ్‌రూం ఇళ్లను నిర్మించి రెండేళ్లు గడుస్తున్నా లబ్ధిదారులకు అప్పగించలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. దీంతో విసిగిపోయిన ఆ పేదలు డబుల్‌ బెడ్రూం ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. తాళాలు పగులగొట్టి ఇళ్లను ఆక్రమించుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా కోటగిరి మండలం బస్వాపూర్‌ గ్రామంలో సోమవా రం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బస్వాపూర్‌ గ్రామానికి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి 50 డబుల్‌ ఇళ్లను మంజూరు చేయించారు.

పేదలు తమ స్థలాలను అప్పగించగా, కాంట్రాక్టర్‌ జీ+1 పద్ధతిలో ఇళ్లు నిర్మించారు. రెండేళ్ల క్రితమే నిర్మాణాలు పూర్తికాగా, అధికారులు వాటికి తాళాలు వేశారు. వాడకంలో లేకపోవడంతో ఇళ్లపై అక్కడక్కడ మొక్కలు కూడా మొలిచాయి. రెండేళ్లు గడుస్తున్నా ఇళ్లు ఇవ్వకపోవడం, ఎన్నిసార్లు అడిగినా చలనం లేకపోవడంతో పేదలు ఆగ్రహానికి గురయ్యారు. తమ కళ్ల ముందే ఇళ్లు పాతబడి పోతుండడంతో జీర్ణించుకోలేని లబ్ధిదారులు వాటి స్వాధీనానికి నడుం బిగించారు. అర్ధరాత్రి తర్వాత మూకుమ్మడిగా వెళ్లి తాళాలను పగులగొట్టి గృహ ప్రవేశాలు జరిపారు. తమ సామగ్రిని తెచ్చి సర్దుకున్నారు. మరోవైపు, లబ్ధిదారుల ఆగ్రహాన్ని గమనించిన అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top