
సాక్షి, సంగారెడ్డి: సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రమాదంలో ఆచూకీ లభించని 8 మంది కార్మికుల కుటుంబాలకు తక్షణ పరిహారం అందించారు. వారు మరణించి ఉంటారని ప్రకటించిన అధికారులు.. అదే సమయంలో వాళ్ల అవశేషాల కోసం సహాయక చర్యలు కొనసాగుతాయని ప్రకటించారు.
బుధవారం.. ఇంకా ఆచూకీ లభించని 8 మంది కార్మికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి తక్షణ సహాయం కింద రూ. 15 లక్షల చెక్కులను అధికారులు పంపిణీ చేశారు. ప్రమాదంలో వాళ్లు పూర్తిగా కాలి బూడిదై ఉంటారని, అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు చేసుకోవాలని, ఆచూకీకి సంబంధించి ఏమైనా సమాచారం ఉంటే చెబుతామని, అప్పటి వరకు బాధిత కుటుంబాలు స్వస్థలాలకు వెళ్లిపోవాలని విజ్ఞప్తి చేశారు.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి ఫార్మా కంపెనీలో జూన్ 30న జరిగిన ఘోర పేలుడు ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటిదాకా 44 మంది మరణించారు. గాయపడిన 34 మందిలో 14 మంది డిశ్చార్జి అయ్యారు. చికిత్స పొందుతున్న వాళ్లలో కొందరు ఇంకా వెంటిలేటర్‌పైనే చికిత్స పొందుతున్నారు. అయితే..
ఇప్పటికీ 8 మంది కార్మికుల ఆచూకీ దొరకలేదు. రాహుల్, శివాజీ, వెంకటేష్, విజయ్, అఖిలేష్, జస్టిన్, రవి, ఇర్ఫాన్‌లు పూర్తిగా కాలి బూడిదైపోయి ఉంటారని భావిస్తున్నారు. పేలుడు సమయంలో వాళ్ల శరీరాలు పూర్తిగా కాలిపోయి ఉండవచ్చని, వారి శరీర అవశేషాలు గుర్తించటం చాలా కష్టమని భావిస్తున్నారు. అయినప్పటికీ అవశేషాల గుర్తింపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కంపెనీ యాజమాన్యం ప్రతి మృతుడి కుటుంబానికి ₹1 కోటి, గాయపడిన వారికి ₹10 లక్షలు పరిహారం ప్రకటించింది.