అందరి దృష్టి రెండో ప్రాధాన్యతపైనే!

Parties Focusing On Graduates Second Priority Vote - Sakshi

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకం కానున్న రెండో ప్రాధాన్య ఓటు

తీవ్ర పోటీ ఉండడంతో తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలడం అనుమానమే

పోలైన ఓట్లలో 50 శాతం, అదనంగా ఒక ఓటు వస్తే విజేతగా ప్రకటన

రెండో ప్రాధాన్యత ఓట్లతోనే ఫలితం తేలవచ్చని రాజకీయ వర్గాల అంచనా

బరిలో పెద్ద ఎత్తున స్వతంత్ర అభ్యర్థులు... వారికి పడే ఓట్లలో రెండో ఆప్షన్‌ ఎవరికో?

సాక్షి, హైదరాబాద్‌: రెండు నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం మరో నాలుగు రోజుల్లో ముగియనుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓ వైపు తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరుతూ మరోవైపు ఓటింగ్‌ విధానంపైనా అవగాహన కల్పించేందుకు పార్టీలు, అభ్యర్థులు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం శాసనమండలి పట్టభద్రుల కోటాలో ఎన్నికలు జరిగే ‘హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌’, ‘నల్లగొండ-ఖమ్మం -వరంగల్‌’ స్థానాల్లోనూ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులుతో పాటు, స్వతంత్రులు కూడా ఎక్కువమంది పోటీ చేస్తుండటంతో ‘ప్రాధాన్యత’ ఓట్లపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

పోలయ్యే ఓట్లలో (చెల్లుబాటు అయ్యే ఓట్లలో) సగానికి పైగా (50 శాతం + ఒక ఓటు) ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించిన వారిని విజేతగా ప్రకటించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఏ ఒక్క అభ్యర్థి ‘ప్రథమ ప్రాధాన్యత’తో గెలుపొందే అవకాశాలు లేవని పార్టీలు, అభ్యర్థులు అంచనా వేస్తున్నారు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లను వీలైనన్ని ఎక్కువ సాధించేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. తమకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసే అవకాశం లేకుంటే... ఓటింగ్‌ సమయంలో కనీసం రెండో ప్రాధాన్యత ఓటైనా వేయాలని ప్రచారం సందర్భంగా అభ్యర్థులు, పార్టీలు కోరుతున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల నమోదు రెట్టింపు కావడంతో పోలయ్యే ఓట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశముంది.

హైదరాబాద్‌లో బహుముఖ పోటీ
ఆరేండ్ల క్రితం... 2015లో ‘హైదరాబాద్‌-రంగారెడ్డి- మహబూబ్‌నగర్‌’ స్థానంలో 2.96 లక్షల ఓటర్లగాను కేవలం 39 శాతం అంటే 1.13 లక్షల ఓటర్లు మాత్రమే పోలింగ్‌లో పాల్గొన్నారు. 31 మంది అభ్యర్థులు పోటీలో నిలువగా 53,881 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు సాధించిన బీజేపీ అభ్యర్థి ఎన్‌.రాంచందర్‌రావు తన సమీప టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దేవీప్రసాద్‌పై గెలుపొందారు (చెల్లని ఓట్లు ఎనిమిది వేల పైచిలుకు ఉండటంతో రాంచందర్‌రావు ప్రథమ ప్రాధాన్యత ఓట్లతోనే విజయాన్ని అందుకున్నారు. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన అవసరం రాలేదు). ఈసారి టీఆర్‌ఎస్‌తో పాటు ఇతర రాజకీయ పక్షాలు, ఔత్సాహిక అభ్యర్థులు పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయడంపై ముందస్తుగా దృష్టి సారించడంతో 5.31 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు.

అయితే ఈ దఫా ఎన్నికల్లో ‘హైదరాబాద్‌- రంగారెడ్డి మహబూబ్‌నగర్‌’ పట్టభద్రుల స్థానంలో ఏకంగా 93 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు వివిధ రంగాలకు చెందిన స్వతంత్రులు కూడా పోటీలో ఉండటంతో గతంలో మాదిరిగా ఏ అభ్యర్థి కూడా ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలుపొందే అవకాశం లేదని అంచనా వేస్తున్నారు. దీంతో అన్ని పార్టీలు, అభ్యర్థులు వీలైనన్ని రెండో ప్రాధాన్యత ఓట్లు సాధించడంపై దృష్టి కేంద్రీకరించాయి. ఎక్కువ మంది అభ్యర్థులు బరిలో ఉండటం తమకు అనుకూలిస్తుందని టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ లెక్కలు వేసుకుంటున్నాయి.

‘వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ’లో హేమాహేమీలు
‘వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ’పట్టభద్రుల స్థానానికి 2015లో జరిగిన ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌ రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందారు. 2015 ఎన్నికల్లో 18 మంది అభ్యర్థులు పోటీ చేయగా 2.81 లక్షల ఓట్లకు గాను 1.49 లక్షల మంది పట్టభద్రులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. 53.25 శాతం పోలింగ్‌ నమోదైనా ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రథమ ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థి కూడా పోలైన ఓట్లలో 50 శాతం మార్క్‌ను దాటలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో 5.05 లక్షల మంది పట్టభద్ర ఓటర్లు ఉండగా 71 మంది పోటీ చేస్తున్నారు. వీరిలో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మరోమారు పోటీ చేస్తుండగా, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు కూడా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు.

తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్, యువ తెలంగాణ నుంచి రాణీరుద్రమతో పాటు జయసారధి రెడ్డి, తీన్మార్‌ మల్లన్న తదితరులు కూడా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన రాజకీయ పక్షాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న పలువురు ఎన్నికల బరిలో నిలవడంతో ప్రథమ ప్రాధాన్యత ఓటుతో గెలుపొందడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో ప్రథమ ప్రాధాన్యత ఓట్ల వేట సాగిస్తూనే రెండో ప్రాధాన్యత ఓట్లను రాబట్టేందుకు అభ్యర్థులు శ్రమిస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top