Padma Bhushan Award For Chinna Jeeyar Swamy, Kamlesh D Patel - Sakshi
Sakshi News home page

Hyderabad: పద్మభూషణులు.. జిల్లా నుంచి ఇద్దరికి అత్యున్నత పురస్కారాలు

Published Thu, Jan 26 2023 9:11 AM

Padma Bhushan Award For Chinna Jeeyar Swamy Kamlesh D Patel - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా:  జిల్లా సిగలో పద్మాలు వికసించాయి. గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. దేశవ్యాప్తంగా తొమ్మిది మందికి పద్మభూషణ్‌ అవార్డులు ప్రకటించగా.. వీరిలో ఇద్దరు ప్రముఖులు జిల్లాకు చెందిన వారే ఉండటం విశేషం. వీరిలో ఒకరు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీత్రిదండి చినజీయర్‌స్వామి కాగా.. మరొకరు ధ్యాన గురువు కమలేష్‌ డి. పటేల్‌(దాజీ).  

ఆధ్యాత్మిక, సేవాతత్పరుడు
ఆధ్యాత్మిక రంగంతో పాటు విద్య, వైద్య, సామాజిక రంగాల్లోనూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న చినజీయర్‌స్వామిని పద్మభూషణ్‌ వరించింది. ఏపీకి చెందిన ఆయన ఇరవై ఏళ్ల క్రితం శంషాబాద్‌ సమీపంలో శ్రీరామనగరం పేరుతో ఆశ్రమం ఏర్పాటు చేశారు. జీవా గురుకులం, నేత్ర విద్యాలయం, దివ్యసాకేతం వంటి సంస్థలను నెలకొల్పి ఆయా రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారు. సమతా స్ఫూర్తి కేంద్రంలో 216 అడుగుల ఎత్తైన భారీ సమతా మూర్తి విగ్రహాన్ని నెలకొల్పారు.

ఇందులో 108 దివ్య క్షేత్రాలను ఏర్పాటు చేశారు. వికాస తరంగిణి పేరుతో విపత్తుల సమయంలో బాధితులకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. నేత్ర విద్యాలయంలో అంధ విద్యార్థులకు వసతి, చదువు, ఉపాధి అవకాశాలు కల్ఫిస్తున్నారు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లక్షలాది మంది భక్తులు, అభిమానులు ఉన్నారు. చినజీయర్‌కు అవార్డు రావడంపై ఆయన శిష్యులు హర్షం వ్యక్తం చేశారు. 

ధ్యానగురువు.. ప్రకృతి ప్రేమికుడు 
గుజరాత్‌కు చెందిన ప్రముఖ ధ్యాన గురువు కమలేశ్‌ డి. పటేల్‌ను పద్మభూషణ్‌ అవార్డు వరించింది. ధ్యానం ద్వారా ఆరోగ్యం, ఏకాగ్రతను సాధించాలనే సంకల్పంతో పదేళ్ల క్రితం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలానికి చేరుకున్నారు. సుమారు 1,400 ఎకరాల్లో కన్హా శాంతి వనం పేరుతో ధ్యాన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెడిటేషన్‌ సెంటర్‌ను నెలకొల్పారు.  ఒకేసారి లక్ష మంది కూర్చుని ఏకాంతంగా ధ్యానం చేసే అవకాశం కల్పించారు. ఇక్కడ 160 దేశాలకు చెందిన సుమారు ఐదువేల మంది అభ్యాసికులు ఉన్నారు.

ఒకప్పుడు ఎడారిలా ఉన్న ప్రాంతంలో లక్షలాది మొక్కలు నాటి.. పచ్చదనం పరిఢవిల్లేలా చేశారు. మానసిక రుగ్మతలతో బాధపడుతున్న అనేక మందికి ధ్యానంతో నయం చేస్తున్నారు. 2025 నాటికి ఇక్కడ 30 బిలియన్ల మొక్కల నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా ఇక్కడ ఏటా వేలాది మొక్కలు నాటుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు. ధ్యాన గురువుగా ఆయన చేస్తున్న సేవలకు ఇప్పటికే అనేక అవార్డులు అందుకున్నారు. ఈ క్రమంలో పద్మభూషణ్‌ రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 1978 గుజరాత్‌ వర్సిటీలో ఫార్మసీ కోర్సులో డిగ్రీ పూర్తి చేశారు. 1980లో అమెరికాలోని న్యూయార్క్‌లో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశారు. కమలేశ్‌ పటేల్‌కు ఇద్దరు కుమారులు, ముగ్గురు మనవలు ఉన్నారు.
చదవండి: ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. మొత్తం 106 మందికి

Advertisement

తప్పక చదవండి

Advertisement