డాక్టరేట్‌ అందుకున్న శంతను నారాయణ్‌ | Sakshi
Sakshi News home page

డాక్టరేట్‌ అందుకున్న శంతను నారాయణ్‌

Published Wed, Nov 1 2023 4:43 AM

OU confers Adobe CEO Shantanu Narayen with honorary doctorate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/ఉస్మానియా యూనివర్సిటీ: అమెరికాకు చెందిన అడోబ్‌ కంపెనీ సీఈవో పద్మశ్రీ శంతను నారాయణ్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయం 49వ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. మంగళవారం క్యాంపస్‌లోని ఠాగూర్‌ ఆడిటోరియంలో జరిగిన  83వ స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్, ఓయూ చాన్స్‌లర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అధ్యక్షత వహించగా పద్మశ్రీ శంతను నారాయణ్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

పద్మశ్రీ శంతను నారాయణ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో చేసిన విశేష సేవలకు డాక్టరేట్‌కు ఎంపిక చేసినట్లు వీసీ ప్రొ.రవీందర్‌ పేర్కొన్నారు. ఇంతవరకు డాక్టరేట్లు అందుకున్న 49 మందిలో పద్మశ్రీ శంతను నారాయణ్‌ మూడో ఓయూ పూర్వవిద్యార్థి అవడం విశేషం. అనంతరం గవర్నర్‌ పీజీ విద్యార్థులకు బంగారు పతకాలను అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓయూలో అన్ని విభాగాలలో బంగారు పతకాలను ప్రవేశపెట్టాలని, అందుకు పూర్వవిద్యార్థులు సహకరించాలన్నారు. నేడు (31న) తన పెళ్లిరోజు అయినప్పటికీ మీ కోసం పాండిచ్చేరినుంచి వచ్చానని ఆమె చెప్పా­రు. సమయాన్ని వృధా చేయకుండా కష్టపడి పనిచేస్తే అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చని పేర్కొన్నారు.  

బంగారు పతకాలలో మహిళల రికార్డు.. 
ఓయూలో అత్యధికంగా బంగారు పతకాలు సాధించి మహిళలు రికార్డు సృష్టించారు. ప్రకటించిన 46 మంది పీజీ విద్యార్థుల్లో 40 మంది మహిళలు కాగా కేవలం ఆరుగురు మాత్రమే పురుషులు ఉన్నారు. వివిధ విభాగాలలో 1,024 మంది పీహెచ్‌డీ డాక్టరేట్‌ డిగ్రీ పట్టాలు అందుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొ.లింబాద్రి, వీసీ ప్రొ.రవీందర్, రిజి్రస్టార్‌ ప్రొ.లక్ష్మీనారాయణ, ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ ప్రొ.రాములు తదితరులు పాల్గొన్నారు.  

మా ఇంట్లో మూడో పీహెచ్‌డీ: శంతను నారాయణ్‌ 
స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన పద్మశ్రీ శంతను నారాయణ్‌ గవర్నర్‌ తమిళిసై, వీసీ ప్రొ.రవీందర్‌ చేతుల మీదుగా డాక్టరేట్‌ను అందుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, అమ్మా, నా భార్య పీహెచ్‌డీ డాక్టరేట్లు కాగా తనతో మూడోదన్నారు. ప్రపంచంలో ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతోందని, మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా విద్యార్థులు అవకాశాలను ఎంచుకోవాలన్నారు. అనంతరం పీహెచ్‌డీ డాక్టరేట్‌ డిగ్రీలను సాధించిన 1,024 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు. 

ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు డాక్టరేట్‌ 
అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి  డాక్టరేట్‌ అందుకున్నారు. ‘భారతదేశంలో శాసనసభ్యుల శాసనాధికారాలు–వాటిపై న్యాయ సమీక్ష’ అనే అంశంపై న్యాయశాస్త్రంలో చేసిన పరిశోధనకు గాను బాలరాజుకు పీహెచ్‌డీ పట్టా లభించింది. అడోబ్‌ కంపెనీ సీఈవో శంతను నారాయణ్‌ చేతుల మీదుగా ఆయన డాక్టరేట్‌ అందుకున్నారు.  

డాక్టరేట్ల ఆనందం... 
ఓయూ నుంచి పీహెచ్‌డీ డాక్టరేట్లు అందుకున్న అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేశారు. డాక్టరేట్‌ డిగ్రీలను అందుకున్న వారిలో ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర పనులు చేసేవారే అధికంగా ఉన్నారు. పీహెచ్‌డీలో ప్రవేశం పొంది ఉద్యోగాలు రావడంతో 10, 15 సంవత్సరాల క్రితం చదవులను వదిలేసి ఇక డాక్టరేట్‌ను అందుకోలేమని అనుకున్న మాకు వీసీ వన్‌టైం ఛాయిస్‌తో పరిశోధనను పూర్తి చేసే అవకాశం కల్పించారని అనేక మంది విద్యార్థులు పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement