52 వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటాం 

Oil palm plantation taken up on 52k Acres this year: Minister Niranjan Reddy - Sakshi

2023–24లో నాటేందుకు కోటి మొక్కలు అందుబాటులోకి: మంత్రి నిరంజన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: కేవలం ఒక్క ఏడాదిలోనే 52 వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటి రికార్డు సృష్టించామని, మొక్కలు నాటేందుకు తగిన నిధులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. అదే విధంగా కంపెనీలు గ్రామాల వారీగా అవగాహన సమావేశాలు నిర్వహించాలని, రైతు వేదికలలో శిక్షణ ఇప్పించాలని, ఆయిల్‌ పామ్‌ మీద ఆదాయం వచ్చే వరకు రైతులు అంతర పంటలు వేసుకునేందుకు వారికి అవగాహన, ఇతర సహకారం కల్పించాలని పేర్కొన్నారు.

ఆయిల్‌ పామ్‌ సాగుపై శనివారం రెడ్‌హిల్స్‌ ఉద్యాన శిక్షణ కేంద్రంలో మంత్రి నిరంజన్‌రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 ఆయిల్‌ పామ్‌ కంపెనీల ద్వారా 1,502 ఎకరాల్లో 38 ఆయిల్‌ పామ్‌ మొక్కల నర్సరీలు ఏర్పాటు చేశామని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో మరో 70 వేల ఎకరాల్లో మొక్కలు నాటడం పూర్తి కావాలని ఆదేశించారు.

2023– 24 లో నాటేందుకు అందుబాటులో కోటి ఆయిల్‌ పామ్‌ మొక్కలు ఉన్నాయని, ఇవి మరో 1.50 లక్షల ఎకరాలకు సరిపోతాయని స్పష్టం చేశారు. ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ మిల్లుల ఏర్పాటుకు ఆయిల్‌ ఫెడ్‌ ద్వారా 458 ఎకరాల భూమి సేకరణ జరిగిందని, నిర్మల్, వనపర్తి, మంచిర్యాలలలో ఈ మిల్లుల ఏర్పాటుకు ప్రీ యూనిక్, మ్యాట్రిక్స్‌ కంపెనీలకు టీఎస్‌ఐఐసీ ద్వారా భూమి కేటాయింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బొప్పాస్‌పల్లి విత్తన క్షేత్రంలో ఆయిల్‌ పామ్‌ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.

నల్లగొండ జిల్లా డిండి వ్యవసాయ క్షేత్రం, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం మాల్‌ తుమ్మెద విత్తన క్షేత్రంలో ఆయిల్‌ పామ్‌ మొక్కల కేంద్రాల ఏర్పాటుపై పరిశీలనకు అధికారులను ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, ఉద్యాన శాఖ డైరెక్టర్‌ హనుమంతరావు, ఆయిల్‌ ఫెడ్‌ ఎండీ సురేందర్, జేడీ సరోజిని, ఉద్యాన శాఖ అధికారులు, ఆయిల్‌ పామ్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top