Hyderabad: పెను గాలులు, జడివానలకు దడ పుట్టిస్తున్న శిథిల భవనాలు

Officials Neglect On Ruined Old Buildings In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పెను గాలులకు హోర్డింగ్‌లు.. జడివానలకు శిథిల భవనాలు కుప్పకూలడం తెలిసిందే. ఈ సమస్యల పరిష్కారానికి ఆయా సీజన్లు రావడానికి ముందే తగిన చర్యలు చేపట్టాలి. కానీ, జీహెచ్‌ఎంసీలో మాత్రం సీజన్లు వచ్చేంతవరకూ అశ్రద్ధ వహించడం..  ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం తంతుగా మారింది. జీహెచ్‌ఎంసీలో శిథిల భవనాలను వర్షాకాలం వచ్చేలోగా కూల్చివేయడమో, మరమ్మతులు చేయడమో, వాటిలో ఉంటున్న వారిని ఖాళీ చేయించడమో చేయాలి. కానీ ఇందుకు గత కొన్నేళ్లుగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆచరణలో విఫలమవుతున్నారు.  

యంత్రాంగం విఫలం.. 
వరుస వర్షాలతో నగరంలోని శిథిల భవనాలు భయంగొల్పుతున్నాయి. నగరంలో ప్రతియేటా వర్షాల సమయంలో పురాతన భవనాలు కూలి ప్రమాదాలు జరుగుతున్నా తగిన చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. శిథిల భవనాలపై చర్యలు తీసుకుంటున్నట్లు ప్రక టిస్తున్నప్పటికీ తూతూమంత్రంగా కొద్దిమేర చర్యలతో సరిపెడుతున్నారు. బలహీనుల దగ్గర ప్రభావం చూపిస్తున్నప్పటికీ, బలవంతుల భవనాల విషయంలో ఏమీ చేయలేకపోతున్నారు. ఈ ఏడాది సైతం ఇప్పటి వరకు 128 శిథిల భవనాలను కూల్చివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.  

జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారుల లెక్కల మేరకే చర్యలు తీసుకోవాల్సినవి ఇంకా 257 శిథిల భవనాలు ఉన్నాయి. వారి లెక్కలోకి రానివి ఇంకా ఎక్కువే ఉంటాయి. నగరంలో ప్రతిసంవత్సరం కూడా జూలై నుంచి అక్టోబర్‌ మధ్య భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన వాటికి ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహించాలన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఇరుకు గల్లీల్లో 20 గజాల స్థలంలోనే అయిదంతస్తులు నిర్మించిన భవనాలు సైతం నగరంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా జీహెచ్‌ఎంసీ అధికారులు శిథిల భవనాలకు సంబంధించి వేగిరం తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.   

సెల్లార్ల తవ్వకాలపైనా చర్యలు.. 
సెల్లార్ల నిర్మాణాల విషయంలోనూ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. 

ఈ సంవత్సరం ఇలా.. 
► నగరంలో శిథిల భవనాలు మొత్తం: 584 
► కూల్చినవి: 128 
► మరమ్మతులు చేసినవి, లేదా ఖాళీ చేయించినవి:199  
► చర్యలు తీసుకోవాల్సినవి: 257   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top