ఈ మొక్కకు ఓ లెక్క ఉందండోయ్‌

Officers Inspects Haritha Haram Survey In Karimnagar - Sakshi

అటవీశాఖ ఆధ్వర్యంలో పది బృందాల ఏర్పాటు 

హరితహారంలో నాటిన మొక్కలపై సమగ్ర సర్వే 

ఈ నెల 15వరకు గడువు 

కరీంనగర్‌రూరల్‌: తెలంగాణకు హరితహారంలో భాగంగా జాతీయ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో రెండేళ్ల నుంచి నాటిన మొక్కలపై అటవీశాఖ ఆద్వర్యంలో సమగ్ర సర్వే చేపట్టారు. కరీంనగర్, హుజూరాబాద్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ పరిధిలోని15 మండలాలతోపాటు జమ్మికుంట, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో ఈ నెల 1నుంచి మొక్కలను లెక్కించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లోని మొక్కల వివరాలను ఈ నెల 15వరకు సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. 

జిల్లావ్యాప్తంగా 148 ప్రాంతాల్లో సర్వే
2019,2020 సంవత్సరాల్లో నాటిన మొక్కలను సమగ్రంగా సర్వే చేసేందుకు వీలుగా జిల్లాలో 148 ప్రాంతాలను ఎంపిక చేశారు. జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్‌ ఆధ్వర్యంలో సర్వేబృందాలను ఏర్పాటు చేసి మొక్కలను లెక్కిస్తున్నారు. రెండేళ్లలో నాటిన మొత్తం మొక్కల్లో ఒకశాతం చొప్పున సర్వే చేస్తున్నారు. 2019లో 85,363 మొక్కలు, 2020లో 52,164 కాగా.. జమ్మికుంట, కొత్తపల్లి మున్సిపాలిటీల్లో 3,747 మొక్కలు తనిఖీ చేస్తారు.

కరీంనగర్‌ రేంజ్‌లోని కరీంనగర్‌ మండలం, కొత్తపల్లి మున్సిపాలిటీకి మహ్మద్‌ మునీర్‌ అహ్మద్, చొప్పదండి మండలానికి వీవీ భరణ్, గంగాధర మండలానికి కిరణ్మయి, రామడుగు మండలానికి సుజాత, తిమ్మాపూర్, చిగురుమామిడి మండలాలకు చైతన్య, హుజూరాబాద్‌ రేంజ్‌లో ఎఫ్‌ఆర్‌వోలు రాజేశ్వర్‌రావు,ఎల్లయ్య, సరిత, బీర్బల్, పూర్ణిమల ఆద్వర్యంలోని 10 బృందాలు సర్వే చేస్తున్నాయి.

మొక్కల సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు
ఆయా ప్రాంతాల్లో సర్వే బృందాల ప్రతినిధులు స్థానిక గ్రామపంచాయతీల కార్యదర్శుల సహకారంతో మొక్కల సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు. నాటిన మొక్కల్లో ఎండిపోయిన, బతికిన మొక్కలు, ఒకే వరుసలో ఉన్న  మొత్తం మొక్కలు, వాటిఎత్తు వివరాలను సేకరిస్తున్నారు. రహదారులకు రెండువైపుల నాటిన మొక్కలను వందశాతం లెక్కించడంతోపాటు గృహాల్లో నాటిన మొక్కలను 10శాతం లెక్కిస్తున్నారు. ప్రతి రోజు మొక్కల సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్‌లో పూర్తి చేసి టీజీఎఫ్‌ఐఎంఎస్‌లో నమోదు చేస్తున్నట్లు కరీంనగర్‌ ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 30 ప్రాంతాల్లో మొక్కల సర్వే పూర్తి చేసినట్లు వివరించారు.

చదవండి: ‘బుల్లెట్టు బండి’ పాట 22 రోజుల కష్టం: రచయిత లక్ష్మణ్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top