రాష్ట్రంలో అణు విద్యుత్‌ ప్లాంట్లు! | Nuclear power generation in Telangana: Revanth Reddy | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అణు విద్యుత్‌ ప్లాంట్లు!

Jul 12 2025 4:16 AM | Updated on Jul 12 2025 4:20 AM

Nuclear power generation in Telangana: Revanth Reddy

ఇతర రాష్ట్రాల్లో వీటి పనితీరుపై అధ్యయనానికి సీఎం ఆదేశం 

ప్లాంట్ల ఏర్పాటు, ఖర్చు, ఉత్పత్తి, ధరలు పరిశీలించాలని సూచన 

4 వేల మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసే యోచన 

భవిష్యత్‌ అవసరాల దృష్ట్యా తక్కువ ధరకు లభించే విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి 

రాష్ట్రంలో ఇప్పటికే మణుగూరులో భారజల ఉత్పత్తి కేంద్రం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అణు విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. కనీసం 4 వేల మెగావాట్ల కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఇటీవల దీనిపై సమీక్ష నిర్వహించింది. అణు ఇంధన ఉత్పత్తికి గల అవకాశాలపై అధికారుల నుంచి నివేదిక కోరింది. ఇతర రాష్ట్రాల్లో వీటి ఏర్పాటు, అయిన ఖర్చు, పనితీరు, విద్యుత్‌ ఉత్పత్తి ధరలను పరిశీలించాలని వారిని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీంతో విద్యుత్‌ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి పెట్టారు. ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ త్వరలో నిపుణులతో సంప్రదింపులు జరపాలని యోచిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే నిపుణులతో కూడిన కన్సల్టెన్సీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.

2047 నాటికి దేశవ్యాప్తంగా లక్ష మెగావాట్ల అణు ఇంధన ఉత్పత్తి జరగాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది బడ్జెట్‌లో నిధులు పెంచింది. మరోవైపు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అణు ఇంధన ఉత్పత్తికి వనరులున్నాయని అధికారులు చెబుతున్నారు. దేశంలోనే అతిపెద్ద భారజల ఉత్పత్తి కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఉంది. ఇక్కడి నుంచి భారజలం దేశంలోని అన్ని అణు విద్యుత్‌ కేంద్రాలకూ అందుతోంది. సహజ యురేనియంను ఉపయోగించే అణు రియాక్టర్లలో శీతలీకరణకు (కూలెంట్‌గా) దీనిని ఉపయోగిస్తారు.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అణు విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు చేస్తే వనరులను ఇక్కడే వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అయితే అణు విద్యుత్‌ ప్లాంట్ల మంజూరు, స్థాపన, ఉత్పత్తి వినియోగం మొత్తం కేంద్ర ప్రభుత్వ న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఉండటం గమనార్హం.

కర్బన ఉద్గారాలకు చెక్‌! 
ప్రస్తుతం 14 వేల మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ ఉంది. థర్మల్, జల విద్యుత్‌ కేంద్రాల ద్వారా ఉత్పత్తి జరుగుతోంది. అయితే థర్మల్‌కు అవసరమైన బొగ్గుకు ఇబ్బందులున్నాయి. యాదాద్రి థర్మల్‌ ప్లాంటుకు వచ్చే ఫిబ్రవరికి 50 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం. ఇంత మొత్తం సింగరేణి అందించే పరిస్థితి కని్పంచడం లేదు. మరోవైపు బొగ్గు మండించడం వల్ల వచ్చే కర్బన ఉద్గారాలు సమస్యగా మారుతున్నాయి. దీంతో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి పెట్టారు. థర్మల్‌ విద్యుత్‌ యూనిట్‌ సగటున రూ.4 వరకు ఉండగా, సోలార్‌ విద్యుత్‌ యూనిట్‌ రూ.2.15కు లభిస్తోంది.

కానీ సాయంత్రం, రాత్రి వేళల్లో బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొంటే యూనిట్‌ రూ.9 వెచి్చంచి కొనాల్సి వస్తోంది. జలవిద్యుత్‌ చవక అయినా అది పరిమితంగానే ఉంది. కాగా వచ్చే పదేళ్లలో విద్యుత్‌ డిమాండ్‌ మరో 9 వేల మెగావాట్లకు పెరిగే వీలుంది. దీంతో అణు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అణు విద్యుత్‌ ప్లాంట్లు 90 శాతం ప్రాజెక్టు లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌) ఇస్తున్నాయి.

అంటే ప్రతి వంద మెగావాట్లు 24 గంటలు పనిచేశాయనుకుంటే 2.4 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. దేశంలో 8 అణు విద్యుత్‌ కేంద్రాలున్నాయి. వీటిలో 25 రియాక్టర్లు పనిచేస్తున్నాయి, వీటి మొత్తం సామర్థ్యం 8,880 మెగావాట్లు. ప్రస్తుతం ఈ విద్యుత్‌ యూనిట్‌ రూ. 3.15కు లభిస్తోంది. మరో పది కేంద్రాల ఏర్పాటు జరుగుతోంది. గుజరాత్, రాజస్తాన్‌లో ఒక్కో యూనిట్‌ 700 మెగావాట్లతో నిర్మిస్తున్నారు.  

ఆధునిక సాంకేతికతతో ఉత్పత్తి ఇలా.. 
అణు ఇంధన రంగంలో ప్రస్తుతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తు న్నారు. దీనివల్ల ప్లాంట్‌ నిర్మాణ వ్యయం తగ్గుతోంది. అణు రియాక్టర్‌లోని భారజలంలో యురేనియం, థోరియం పరమాణువులను విచి్ఛన్నం చేస్తారు. దీంతో వెలువడే వేడిమితో నీటి ఆవిరి తయారవుతుంది. దాన్ని ఉపయోగించి టర్బైన్లను తిప్పడం ద్వారా విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అణు విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన యురేనియం, థోరియం నిల్వలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఉన్నట్టు ఇటీవల పరిశోధనల్లో తేలింది.  

ప్రయోజనాలెన్నో.. 
థర్మల్, అణు విద్యుత్‌ కేంద్రాలకు చాలా తేడా ఉంది. వి ద్యుత్‌ ప్లాంట్‌కు అవసరమైన యురేనియం, థోరియం సూట్‌కేస్‌ పరిణామంలోనే తీసుకెళ్ళొచ్చు. థర్మల్‌ కేంద్రాలకు వాడే బొగ్గును రైల్వే వ్యాగన్ల ద్వారా పంపాలి. అణు విద్యుత్తు కేంద్రాల స్థాపనకు, థర్మల్‌తో పోలిస్తే నాలుగో వంతు భూమి సరిపోతుంది. ఇటీవల కాలంలో చిన్న మాడ్యులర్‌ రియాక్టర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటికి ఇంకా తక్కువ స్థలం వాడొచ్చు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల కాల పరిమితి 20 ఏళ్ళు. అణు కేంద్రాల కాల పరిమితి 40 ఏళ్ళ పైనే. అణు విద్యుత్‌ కేంద్రాల్లో హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా అదనపు ప్రయోజనం పొందవచ్చు.

దేశంలోని అణు విద్యుత్‌ కేంద్రాలు
తారాపూర్‌ అణు విద్యుత్‌ కేంద్రం - మహారాష్ట్ర 
రాజస్తాన్‌ అణు విద్యుత్‌ కేంద్రం - రాజస్తాన్‌ 
మద్రాస్‌ అణు విద్యుత్‌ కేంద్రం - తమిళనాడు 
నరోరా అణు విద్యుత్‌ కేంద్రం - ఉత్తరప్రదేశ్‌ 
కైగా అణు విద్యుత్‌ కేంద్రం - కర్ణాటక 
కుడంకుళం అణు విద్యుత్‌ కేంద్రం - తమిళనాడు 
కాక్రపార అణు విద్యుత్‌ కేంద్రం - గుజరాత్‌  

అణువిద్యుత్‌ ఉత్పత్తి పెరుగుతోంది
అణు ఇంధన విద్యుత్‌ ప్లాంట్ల ఏర్పాటుపై అన్ని రాష్ట్రాలూ దృష్టి పెట్టాయి. కేంద్రం కూడా అత్యధిక ప్రాధాన్యమిస్తోంది. భవిష్యత్‌ విద్యుత్‌ ఉత్పత్తి అవసరాలు తీర్చేందుకు అణు ఇంధన ప్లాంట్ల ఏర్పాటు అవసరం. వనరులు పుష్కలంగా ఉన్న తెలంగాణలో అణు ఇంధనం ప్రయోజనకరం.  – జి.వీర మహేందర్‌ (టీజీ జెన్‌కో ఫైనాన్స్‌ డైరెక్టర్‌) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement