ఫార్ములా–ఈ రేస్‌ కేసులో కేటీఆర్‌కు నోటీసులు | Notice To KTR In Formula E Race Case: Telangana | Sakshi
Sakshi News home page

ఫార్ములా–ఈ రేస్‌ కేసులో కేటీఆర్‌కు నోటీసులు

May 15 2026 1:37 AM | Updated on May 15 2026 1:40 AM

Notice To KTR In Formula E Race Case: Telangana

అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్‌ రెడ్డికి కూడా..

జూలై 31న హాజరుకావాలన్న ఏసీబీ కోర్టు  

సిటీ కోర్టులు, (హైదరాబాద్‌): ఫార్ములా–ఈ రేస్‌ కేసులో మాజీమంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు నాంపల్లిలోని ఏసీబీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏసీబీ అధికారులు దాఖలు చేసిన చార్జిషిట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు కేటీఆర్‌ (ఏ–1)తో పాటు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్‌ (ఏ–2), హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డి (ఏ–3)కి గురువారం నోటీసులు జారీ చేసింది.

జూలై 31న కోర్టులో హాజరుకావాలని తెలిపింది. స్పోర్ట్స్‌ కన్సల్టెంట్‌ కిరణ్‌ మల్లేశ్వరరావు (ఏ–4), యూకేకు చెందిన ఎఫ్‌ఈఓ సంస్థ (ఏ–5)లను కూడా ఏసీబీ ఈ కేసులో నిందితులుగా చేర్చింది. హెచ్‌ఎండీఏకు చెందిన రూ.55 కోట్లకు పైగా నిధులను విదేశీ సంస్థలకు నిందితులు మళ్లించినట్లు ఏసీబీ అభియోగాలు మోపింది. ఆర్థిక లావాదేవీలు, తదితరాలకు సంబంధించి దాదాపు వెయ్యికి పైగా పత్రాలను కోర్టుకు సమర్పించింది. ఈ మేరకు చార్జిషిట్‌ను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం పత్రాల పరిశీలన అనంతరం విచారణకు స్వీకరించనుంది. 

రూ. 54.89 కోట్ల మళ్లింపు ఆరోపణలు 
కేటీఆర్‌ ప్రాసిక్యూషన్‌కు గత గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ, అర్వింద్‌కుమార్‌ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2022 ఫిబ్రవరిలో హుస్సేన్‌సాగర్‌ వద్ద ఫార్ములా–ఈ కార్‌ రేస్‌ పోటీలు నిర్వహించారు. ఆ సమయంలో ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా నిబంధనలు ఉల్లంఘించి హెచ్‌ఎండీఏకు చెందిన రూ. 54.89 కోట్లను విదేశీ కంపెనీ ఖాతాల్లోకి మళ్లించారన్నది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. కాగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ నిధుల విషయంలో ఎంఏయూడీ ముఖ్య కార్యదర్శి దానకిషోర్‌ 2024 డిసెంబర్‌ 18న ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా డిసెంబర్‌ 19న ఏసీబీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఇప్పటికే కేటీఆర్‌ తదితరులు విచారించింది.

Advertisement
 
Advertisement
Advertisement