
అన్ని కోర్సులకూ పాత ఫీజులే
ఉత్తర్వులు విడుదల చేసిన సర్కారు.. ఈ ఏడాది ఫీజుల సవరణ లేనట్లే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రొఫెషనల్ కాలేజీల్లోని అన్ని కోర్సుల ట్యూషన్ ఫీజులపై సర్కారు స్పష్టత ఇచ్చింది. 2025–26 విద్యా సంవత్సరంలో పాత ఫీజులే ఉంటాయని వెల్లడించింది. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు 2022–25 బ్లాక్ పీరియడ్ ఫీజులే ఈ ఏడాది అమలవుతాయని ఉత్తర్వులు జారీ చేసింది. 2025–28 (మూడేళ్లు) బ్లాక్ పీరియడ్‌లో ఫీజుల సవరణకు తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్సీ) కాలేజీల వారీగా ప్రతిపాదనలు స్వీకరించి, ప్రత్యక్ష విచారణలు జరిపింది. అనంతరం ఫీజులను కూడా ఖరారు చేసింది.
అయితే ఫీజులను అధికారికంగా ధ్రువీకరిస్తూ జీవో జారీ చేయాల్సిన తరుణంలో ప్రభుత్వం ఫీజుల సవరణకు బ్రేకులు వేసింది. కొన్ని కాలేజీల్లో ఫీజులు ఆసాధారణంగా పెరగడంపై సర్కారు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. వ్యత్యాసం భారీగా ఉండటం, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, నిబంధనలు, ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్నట్టు గుర్తించింది. దీంతో ఫీజుల సవరణను నిలిపివేసింది.
ఇక ఫీజులపై త్వరలోనే ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ కమిటీ ఫీజుల ఖరారును పరిశీలిస్తుందని, సవరణను సూచిస్తుందని, ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఫీజులను ఈ కమిటీ పరిశీలిస్తుందని సర్కారు వెల్లడించింది. వీటితోపాటు హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాల మేరకు ఫీజుల సవరణపై ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు సర్కారు తెలిపింది.
చదవండి: జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ పెంపు