అది ‘వ్యాపార’ కేంద్రం!

Niranjan Reddy Comments On Piyush Goyal - Sakshi

పేదలు, రైతులపై శ్రద్ధ లేదు

కేంద్ర మంత్రి గోయల్‌ తీరు అహంకారపూరితమన్న మంత్రి నిరంజన్‌రెడ్డి

ధాన్యం కొనుగోళ్లపై దుర్మార్గంగా మాట్లాడారు.. పైగా తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు సిగ్గుచేటు

ఎవరిది రైతు వ్యతిరేక ప్రభుత్వం? 
దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతులకు నీళ్లిచ్చి, కరెంటు ఇచ్చి, రైతుబంధు ఇచ్చి, రైతు బీమా భరోసా ఇచ్చి పంటలు సాగు చేసేలా ప్రోత్సహించిన తెలంగాణ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమా? రైతుల పంటను కొనబోమని చెప్తున్న కేంద్రానిది రైతు వ్యతిరేక ప్రభుత్వమా? కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడిన తీరు దురహంకారపూరితం. దౌర్భాగ్యం, దురదృష్టకరం. 
– వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి 

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో యాసంగి ధాన్యం సేకరణ విషయంగా కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మాట్లాడిన తీరు దురహంకారపూరితమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రి అత్యంత సున్నితమైన అంశంపై ఎంతో అవహేళనగా మాట్లాడారని.. తాము లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా పాతపాటే పాడారని ఆక్షేపించారు. ఈ అంశంలో సీఎం కేసీఆర్‌తో మాట్లాడాక ధాన్యం కొనుగోళ్లపై తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. గురువారం పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తో మంత్రులు నిరంజన్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, టీఆర్‌ఎస్‌ ఎంపీలు భేటీ అయ్యారు.

అనంతరం నిరంజన్‌రెడ్డి తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ బాధ్యత రాజ్యాంగపరంగా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని.. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి వ్యాపార ధోరణి మినహా సంక్షేమ ఆలోచన ఏమాత్రం లేదని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. మార్కెట్లో ఏది అవసరమో అదే కొంటామన్నట్టుగా కేంద్రం వ్యవహరిస్తోందన్నారు. ‘‘పంటను ఎలా వినియోగించాలో ఆలోచించాలని, ఈ అంశంపై మేధోమథనం చేసి రైతాంగానికి దారి చూపించాలని మేం కోరితే.. అది తన పని కాదంటూ కేంద్ర మంత్రి మాట్లాడారు.

వెంటనే మీడియా వద్దకు వెళ్లి రైతులను తెలంగాణ ప్రభుత్వమే తప్పుదోవ పట్టిస్తోందంటూ నిందలు వేశారు. రైతుల సమస్య పరిష్కరంపై లేని ఆతృత మీడియాతో మాట్లాడటంలో ఎందుకు? ఇది సిగ్గుమాలిన విషయం. తెలంగాణలో 35 లక్షల ఎకరా ల్లో పండే యాసంగి ధాన్యాన్ని మొత్తం కేంద్రం సేకరించాల్సిందే.. రా రైసా, బాయిల్డ్‌ రైసా అనేది మాకు సంబంధం లేదు. ఎట్లా పట్టించుకుంటారో మిల్లర్లతో మీరే పట్టించుకోండి. యంత్రాంగం ఉం టుంది కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఫెసిలిటేట్‌ చేస్తాం’’అని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. 

సమాఖ్య స్ఫూర్తి ఏమైంది?: ప్రధాని మోదీ 2013లో గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు దేశంలో సమాఖ్య స్ఫూర్తి లేదని.. కేంద్రం వివక్ష చూపుతోందని అన్న విషయాలనే ఇప్పుడు తాము చెప్తున్నామని నిరంజన్‌రెడ్డి గుర్తు చేశారు. కరోనా సమయంలో పేదలకు 6 కిలోలకు బదులుగా 60 కిలోలు బియ్యం ఇవ్వాల్సిందని.. గోదాముల్లో మురిగిపోతున్న బియ్యాన్ని పేదలకు పంచితే ఇప్పుడు ధాన్యం సేకరణకు ఇబ్బంది ఏర్పడేది కాదని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన అనేక సమస్యలను పరిష్కరించేందుకు ప్రధానమంత్రి స్థాయిలో ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.  

తెలంగాణకు క్షమాపణ చెప్పే రోజు వస్తుంది
ధాన్యం సేకరణ విషయంలో జరిగిన పరాభవాన్ని మరిచిపోబోమని.. తెలంగాణ ప్రజలకు కేంద్రం క్షమాపణ చెప్పే రోజు వస్తుందని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. ‘‘పంజాబ్‌లో ఎలా తీసుకుంటున్నారో అలా తీసుకుంటామని కేంద్రం అంటోంది. అక్కడ యాసంగిలో వరికి బదులుగా గోధుమలు పండిస్తారన్న విషయాన్ని ఎలా మర్చిపోతున్నారు. అంటే గోధుమలను పిండిగా, పత్తిని బేళ్లు చేసి ఇస్తేనే కేంద్రం తీసుకుంటోందా? తెలంగాణలో రా రైస్‌ ఇస్తేనే తీసుకుంటామని ఎందుకు కొర్రీ పెడుతున్నారు? తెలంగాణలో యాసంగిలో వచ్చే వడ్లను యథాతథంగా తీసుకోవాలనే మేం కోరుతున్నాం’’అని వివరించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top