హైదరాబాద్, బెంగళూరు సహా దాదాపుగా అన్ని మహానగరాలు, పట్టణాల్లో ఇదే సమస్య
పగటి అధిక ఉష్ణోగ్రతల వేడి రాత్రికి చల్లబడక జనం ఉక్కిరి బిక్కిరి
ఇళ్లలో తరచుగా రాత్రి సమయాల్లోనూ 32 నుంచి 36 డిగ్రీల మధ్య కొనసాగుతున్న ఉష్ణోగ్రతలు
2025 అక్టోబర్ నుంచి 2026 ఏప్రిల్ వరకు భారత్‌లో నిర్వహించిన క్లైమేట్ ట్రెండ్స్ అధ్యయనంలో వెల్లడి
రాత్రి సమయాల్లోనూ ఉక్కపోత, వేడి వాతావరణంతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మండువేసవిలో సూర్యాస్తమయం తర్వాత చాలా సేపటి వరకు పడకగదులు ఉక్కపోతగానే ఉంటున్నాయి. దీంతో నిద్రకు అంతరాయం కలగడం, చిరాకు పెరగడం వంటి వాటితో మరుసటి రోజు పని, కార్యకలాపాల నిర్వహణలో ఉత్సాహం, చురుకుదనం కోల్పోయి ఉత్పాదకత కూడా ప్రభావితమవుతోంది.
హైదరాబాద్, బెంగళూరు సహా దాదాపుగా అన్ని మహానగరాలు, పట్టణాల్లో ఇదే సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. ఈ పరిస్థితుల్లో ఇళ్లలో రాత్రిపూట వేడిమి ఒక తీవ్రమైన సంక్షోభంగా మారుతోంది. సూర్యాస్తమయం తర్వాత ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గకపోవడం వల్ల, పగటిపూట వేడి నుంచి భౌతికంగా కోలుకోవడానికి వీలులేకుండా ఒక ‘ఉష్ణ లోటు’ ఏర్పడుతోంది. 2026 వివిధ అధ్యయనాలు, నివేదికల ప్రకారం చూస్తే...2026 మే నాటికి భారత్‌లో పగటి కంటే రాత్రుళ్లే వేగంగా వేడెక్కుతున్నాయని, 76% జనాభా తీవ్రమైన, మిశ్రమ వడగాలుల బారిన పడే అధిక ప్రమాదంలో ఉన్నారని వెల్లడైంది. – సాక్షి, హైదరాబాద్
ఇదీ అధ్యయనం...
2025 అక్టోబర్ నుంచి 2026 ఏప్రిల్ మధ్య ఏడు నెలల హై–రిజల్యూషన్ సెన్సార్ డేటా ఆధారంగా క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ నిర్వహించిన అధ్యయనం పెరుగుతున్న వాతావరణ ముప్పును సూచిస్తోంది. ఉదయం నుంచి కాంక్రీట్ గోడలు, నేలలు నిల్వ ఉంచుకున్న ఎండ వేడిమి విడుదల కావడం వల్ల, రాత్రి 8, 9 గంటల ప్రాంతంలో ఉష్ణోగ్రతలు దాదాపు 34.7ని సెంటిగ్రేడ్‌ల గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. తెల్లవారుజామున కూడా, ఉష్ణోగ్రతలు 33.8ని నుంచి 34ని సెంటిగ్రేడ్‌ల మధ్యే ఉండటంతో ఇళ్లల్లోని వారికి పెద్దగా ఉపశమనం లభించడం లేదు.
ది లాన్సెట్ ప్లానెటరీ హెల్త్‌లో ప్రచురితమైన ఈ పరిశోధనలో వడగాలుల సమయంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడానికి, మరణాల రేటు పెరగడానికి మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని వెల్లడైంది. నిద్రపై జరిపిన అధ్యయనాలు ఇంకా సూచించేదేమిటంటే, ఇళ్లలో 26–28 నిసెంటిగ్రేడ్‌ల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నిద్ర నాణ్యతను గణనీయంగా దెబ్బతీస్తాయి, అయితే 30ని సెంటిగ్రేడ్‌ల మించిన ఉష్ణోగ్రతలు దీర్ఘకాలిక అసౌకర్యానికి క్రమంగా పెరిగే శారీరక ఒత్తిడికి దోహదం చేస్తాయి. తాజాగా ఇండియా హీట్ సమ్మిట్–2026 సందర్భంగా ఈ నివేదికను విడుదల చేశారు.
పట్టణ ప్రణాళికలు.. పర్యావరణహితంగా లేకే సమస్యలు
మనదేశంలో నగరీకరణ అత్యంత వేగంగా వ్యాపిస్తుండడంతో, నగరాలు, పట్టణాలు ‘కాంక్రీట్ జంగిళ్లు’గా మారాయి. హైదరాబాద్, బెంగళూరు ఇతర నగరాల్లో పట్టణ ప్రణాళికలు, పర్యావరణహితంగా లేకనే సమస్యలు తీవ్రమవుతున్నాయి. ఇప్పటివరకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేవి కూడా నగరీకరణపై ప్రణాళికాబద్ధమైన ప్లానింగ్ విషయంలో ఎలాంటి నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేదు. అర్భనైజేషన్‌కు సంబంధించి ఒక బ్లూప్రింట్, కచి్చతమైన ప్లానింగ్, దీర్ఘకాలిక నగర సుస్థిరాభివృద్ధి, ప్రకృతి, పర్యావరణ అనుకూల ‘డిజైన్ విత్ నేచర్’వంటివి, గాలి వీచే దిశ, వర్షపాతం, బహిరంగ, ఖాళీస్థలాలు, ప్రజల అవసరాలకు తగ్గట్టుగా క్రీడామైదానాలు, పార్కులు, స్కూళ్లు వంటి వాటిని అంతర్భాగం చేసి ‘లేయర్డ్ ప్లానింగ్’చేయాల్సి ఉండగా అది జరగలేదు. – ప్రొఫెసర్ .కె.పురుషోత్తంరెడ్డి, ప్రముఖ పర్యావరణవేత్త
అధ్యయనం ముఖ్యాంశాలు...
⇒ గత దశాబ్ద కాలంలో ఇండో–గంగా మైదానంలో తేమ స్థాయిలు 10% పెరిగాయి
⇒ దీనివల్ల ఉష్ణోగ్రత 3–5ని సెంటిగ్రేడ్లు అధికంగా ఉన్నట్టు అనిపిస్తుంది
⇒ రాత్రిపూట సహజంగా చల్లబడే ప్రక్రియను అణచివేస్తుంది
⇒ అధిక ఉష్ణోగ్రతల కారణంగా వేసవిలో దాదాపు 49% మంది ప్రజలు నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారు
⇒ రాత్రులు వెచ్చగా ఉన్నప్పుడు, మానవ శరీరం చల్లబడలేదు, దీనివల్ల శరీరంలో వేడి భారం పెరిగి పక్షవాతం, గుండె, మూత్రపిండాల సమస్యల ప్రమాదం పెరుగుతుంది


