
మధ్యవర్తులుగా మీ సేవ కేంద్రాల ఆపరేటర్లు
కొంత ముట్టజెప్పితే చేతికి పక్షం రోజుల్లో కార్డు
లేనిపక్షంలో పెండింగ్‌లో క్షేత్రస్థాయి విచారణ
ఇదీ గ్రేటర్‌లో కొత్త రేషన్‌కార్డుల పరిస్థితి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో కొత్త రేషన్ కార్డుల దందా బాహాటంగా కొనసాగుతోంది. సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తుండడంతో పేదలు పెద్ద ఎత్తున మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇల్లు, వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలు తెల్ల రేషన్‌కార్డు (ఆహార భద్రత)తో ముడిపడి ఉండడంతో ప్రాధాన్యం పెరిగినట్లయింది.
దీంతో పేద కుటుంబాలు మీ సేవ కేంద్రాలను ఆశ్రయించి కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్నప్పటికీ.. క్షేత్రస్థా విచారణ మాత్రం ముందు సాగడం లేదు. దరఖాస్తుదారుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు మీ సేవ కేంద్రాల నిర్వాహకులు, ఆపరేటర్లు దళారులుగా అవతారమెత్తి కనీసం కొంత ఖర్చు (రూ.3000 నుంచి 5,000 వరకు) భరించేందుకు సిద్ధమైతే పక్షం రోజుల్లో క్షేత్రస్థాయి విచారణ పూర్తి చేయించి కార్డు చేతిలో పెడతామని పేదలను నమ్మిస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పౌర సరఫరాల సిబ్బంది సైతం మధ్యవర్తుల ద్వారా వ చ్చిన దరఖాస్తులను మాత్రమే పరిశీలించి రేషన్ కార్డుకు అర్హులుగా సిఫార్సులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సిఫార్సులు లేని దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టడం గమనార్హం.
2.66 లక్షలకుపైగా దరఖాస్తులు
గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల పరిధిలో రెండు నెలలుగా కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో ఆన్‌లైన్ ద్వారా సుమారు 2.66 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పదేళ్లలో పెద్దగా రేషన్ కార్డులు మంజూరు కాకపోవడంతో కొత్త కార్డుల కోసం తాకిడి పెరిగినట్లయింది.
పెళ్లి చేసుకుని అత్తగారింటికి వచ్చిన కోడళ్లు, కొత్తగా జన్మించిన పిల్లలు రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్నారు. మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న మొత్తం దరఖాస్తుల్లో ఇప్పటి వరకు క్షేత్రస్థాయి విచారణ పూర్తయి పదిశాతం మించి కార్డులు కూడా మంజూరుకు నోచుకోనట్లు తెలుస్తోంది. మెజార్టీ దరఖాస్తులు పెండింగ్‌లో మగ్గుతుండగా, సిఫార్సు దరఖాస్తులు మాత్రం స్పీడ్‌గా విచారణకు నోచుకొని మంజూరు అవుతున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి.
ప్రజాపాలన దరఖాస్తుల పరిస్థితి సైతం..
ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల ఆధారంగా సర్వేలో విచారణ పూర్తయిన వాటికి కూడా మధ్యవర్తుల సిఫార్సులు లేకుండా మోక్షం లభించడం లేదు. విచారణ పూర్తయిన దరఖాస్తులకు సిఫార్సు ఉంటే మాత్రం కార్డులు ఠంచన్‌గా మంజూరవుతున్న సంఘటనలు అనేకం. మిగితావి పెండింగ్‌లో మగ్గుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలో నిర్వహించిన ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం సుమారు 5.73 లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. సమగ్ర సర్వే ద్వారా మొత్తం 22 లక్షల కుటుంబాల వివరాలు సేకరించారు.
అందులో రేషన్ కార్డులు లేని సుమారు 83 వేల కుటుంబాలను గుర్తించారు. వాటిపై నిబంధల ప్రకారం విచారణ నిర్వహించి 70 శాతం కుటుంబాలుగా అర్హులు అని తేల్చారు. పారదర్శకత కోసం వార్డు సభల్లో లబ్దిదారుల జాబితాను ప్రకటించిన తర్వాతే కార్డుల మంజూరుకు సిఫార్సు చేయాలని జీహెచ్‌ఎంసీ భావించినప్పటికీ.. తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో వార్డు సభలు వాయిదా పడి ప్రక్రియ ముందుకు సాగలేదు. జీహెచ్‌ఎంసీ పరిధిలో లేని శివారు ప్రాంతాల దరఖాస్తుదారుల్లో అర్హుల జాబితా ప్రకటించారు. వాటి మంజూరుకు కూడా మధ్యవర్తుల సిఫార్సు తప్పడం లేదన్న ఆరోపణలు వినవస్తున్నాయి.