మూగజీవాలపై యమపాశం

Negligence Of Electricity Authorities Hanging Power Cords Turning Death - Sakshi

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని హనుమాన్‌ బస్తీ, రామవరంలోని చిట్టిరామవరం పొలాల్లో విద్యుత్‌ తీగలు వేలాడుతూ ప్రమాదకరంగా మారాయి. లక్ష్మీదేవిపల్లి, రేగళ్ల, ప్రగతినగర్‌ కాలనీలో కూడా విద్యుత్‌ తీగలు భయపెట్టిస్తున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లకు రక్షణ లేకుండా ప్రధాన రోడ్డుకు దగ్గరగా ఉన్నాయి. 2020–21 సంవత్సరంలో జిల్లాలో జరిగిన విద్యుత్‌ ప్రమాదాల్లో 79 పశువులు, 23 మంది వ్యక్తులు చనిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.

సాక్షి, హైదరాబాద్‌: విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కిందకు వేలాడుతున్న విద్యుత్‌ తీగలు, ట్రాన్స్‌ఫార్మర్లు పాడి పశువులు, మూగ జీవాల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. తక్కువ ఎత్తులో ప్రమాదకరంగా వేలాడే విద్యుత్‌ తీగలు, ఏళ్ల తరబడి మరమ్మతులు, నిర్వహణ లేక గాలివానలకు తెగిపడే తీగలు, పడిపోయే స్తంభాలు, ఎర్తింగ్‌ లోపాలు, నాసిరకం పరికరాల కారణంగా రాష్ట్రంలో ఏటా వందల సంఖ్యలో మూగజీవాలు విద్యుదాఘాతానికి గురై మరణిస్తు న్నాయి. పెద్ద సంఖ్యలో రైతులు, ఇతరులు కూడా మృత్యువాత పడుతున్నారు. ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్‌/ ఎస్పీడీసీఎల్‌)ల అధికారిక లెక్కల ప్రకారం గడిచిన నాలుగేళ్లలో.. అనగా 2017–21 మధ్య కాలంలో రాష్ట్రంలో ఏకంగా 5,400కు పైగా మూగజీవాలు విద్యుత్‌ ప్రమాదాలకు బలయ్యాయి. ఏటా సగటున 1,300 మూగజీవాలు విద్యుత్‌ సంబంధిత ప్రమాదాల్లో మరణిస్తున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక అధికారిక లెక్కలకు అందని మూగజీవాల మరణాలు మరో రెండు రెట్లు అధికంగా ఉంటాయని రైతు సంఘాలు పేర్కొంటున్నాయి. రైతన్నల కుడిఎడమ భుజాలైన కాడెద్దులు పంట పొలాల్లో మేతకు వెళ్లినప్పుడో, మరో సందర్భంలోనో కరెంట్‌ షాక్‌కు గురై మృత్యు వాత పడటం ఆయా కుటుంబాలకు తీవ్ర దుఃఖాన్ని కలిగిస్తోంది. ప్రేమతో పెంచుకునే పాడి పశువులు విద్యుత్‌ ప్రమాదాల్లో మరణించినప్పుడు ప్రజల ఆవేదన వర్ణనాతీతంగా ఉంటోంది. లక్షల విలువైన పశువులతో పాటు జీవనాధారాన్ని కోల్పోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. 50 శాతం ప్రమాదాలకు శాఖా పరమైన లోపాలే కారణం కావడం విచారకరం.

పరిహారం చెల్లింపుల్లో జాప్యం..
శాఖాపరమైన కారణాలతో మనుషులు, మూగ జీవాలు విద్యుదాఘాతానికి గురై మరణిస్తే డిస్కంలు విచారణ జరిపి పరిహారం చెల్లించాలని నిబంధనలు పేర్కొంటున్నాయి. మనుషులకు రూ.5 లక్షలు, ఆవులు, ఎద్దులు, గేదెలు వంటి పాడి పశువులకు రూ.40 వేలు, మేకలు, గొర్రెలకు రూ.7 వేల చొప్పున పరిహారం చెల్లించాలని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) స్పష్టం చేసింది. అయితే ఈ పరిహారం చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. విచారణలు, నివేదికల పేరిట క్షేత్ర స్థాయి అధికారులు తాత్సారం చేస్తున్నారు. కొం త మంది క్షేత్రస్థాయి అధికారులు నెపాన్ని వినియో గదారులపై నెట్టేసి తప్పుడు నివేదికలు ఇచ్చి పరిహారం రాకుండా చేస్తున్నారనే విమర్శ లు న్నాయి. బాగా పాలిచ్చే ఆవులు, గేదెల మార్కెట్‌ ధర రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఉండగా, పరిహారం 50 శాతం కూడా రావడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లో గతేడాది (2020–21) సంభవించిన విద్యుత్‌ ప్రమా దాల్లో 175 మంది మనుషులు మరణించగా, 150 బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించారు. 471 మూగజీవాలు బలి కాగా, 377 జీవాల యజమా నులకు పరిహారం చెల్లించారు. ప్రస్తుత 2021–22 లో గత మే నెల నాటికి 21 మంది మనుషులు,75 మూగజీవాలు మరణించగా 19 మందికి, 40 జీవా లకు పరిహారం లభించింది. 

చాలా ప్రమాదాలు శాఖాపరమైన కారణాలతోనే..
తక్కువ ఎత్తులో విద్యుత్‌ వైర్లు వేలాడటం, ఎర్తింగ్‌ నిర్వహణ లేకపోవడం, విద్యుత్‌ స్తంభాలు/వైర్లు తెగిపడడం, 11/6.6 కేవీ జంపర్లు విఫలం కావడం, 11 కేవీ ఏబీ స్విచ్‌ పైప్‌/కేబుల్‌ ఇన్సులేటర్‌ ఫెయిల్‌ కావడం, హెచ్‌టీ/ఎల్టీ లైన్‌ స్నాప్‌ కావడం, విద్యుత్‌ స్తంభాలకు సపోర్ట్‌గా ఉండే స్టే–వైర్లకు విద్యుత్‌ సరఫరా కావడం, చాలాచోట్ల రక్షణ లేని ట్రాన్స్‌ఫార్మర్లు, ఎల్టీ లైన్లకు చెట్ల కొమ్మలు తగలడం వంటి శాఖాపర కారణాలతోనే 50 శాతానికి పైగా విద్యుత్‌ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తీగలు వేలాడటం వంటి వాటిపై క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బందికి ఫిర్యాదు చేసినా ఏళ్ల తరబడి సమస్యలను పరిష్కరించట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజల అజాగ్రత్తలు, అవగాహన లోపం, భద్రత ప్రమాణాలు పాటించకపోవడం వంటి కారణలతో చాలా ప్రమాదాలు సంభవిస్తున్నాయని డిస్కంల అధికారవర్గాలు పేర్కొంటుండటం గమనార్హం.

‘పవర్‌ వీక్‌’ నిర్వహించినా మారని పరిస్థితి..
చాలా సందర్భాల్లో చిన్నచిన్న లోపాలే విద్యుదాఘాతాలకు దారితీసి నిండు ప్రాణాలను బలిగొంటున్నాయి. ఈ నేపథ్యంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు పవర్‌ వీక్‌ నిర్వహించాలని గతేడాది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు డిస్కంలను ఆదేశించారు. ఇకపై ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా అన్ని రకాల సమస్యలను పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీనిలో భాగంగా ఎస్పీడీసీఎల్‌ సంస్థ రూ.195 కోట్లు ఖర్చు చేసి తమ పరిధిలోని ఐదు ఉమ్మడి జిల్లాల్లోని 8,567 గ్రామాల్లో వివిధ రకాల పనులు చేసినట్టు ప్రకటించుకుంది. వంగిన/తుప్పుపట్టిన/పాడైపోయిన 43,486 స్తంభాల మార్పిడి, దెబ్బతిన్న 22,483 స్టే వైర్ల మార్పిడి, 1,24,175 చోట్లలో వదులుగా ఉన్న తీగలను సరి చేయడం తదితర పనులు చేపట్టినట్లు వెల్లడించింది. ఎన్పీడీసీఎల్‌ సైతం ఇదే తరహాలో పవర్‌ వీక్‌ నిర్వహించి మరమ్మతు, నిర్వహణ పనులు చేపట్టినట్లు తెలిపింది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ సమస్యలు కొనసాగుతుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుని పెద్ద సంఖ్యలో మూగజీవాలు బలవుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top