
బీఎంఎస్ మినహా సంఘాలన్నీ సై
ఒకరోజు సమ్మెతో సంస్థకు రూ.76 కోట్ల మేర నష్టం
సమ్మె వద్దంటున్న అధికారులు.. సందిగ్ధంలో కార్మికులు
సింగరేణి(కొత్తగూడెం): పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి.. నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడంతో కార్మికులు, కార్మిక సంఘాల ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందంటూ జాతీయ కార్మిక సంఘాలు బుధవారం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు సింగరేణి కార్మికులు సైతం సమ్మెలో పాల్గొనాలని.. బీఎంఎస్ మినహా మిగతా జాతీయ, ప్రాంతీయ కార్మిక సంఘాలు నోటీసులు ఇవ్వడమే కాక విస్తృత ప్రచారం చేస్తున్నాయి.
ఇక సింగరేణి యాజమాన్యం ఒక రోజు సమ్మెతో సంస్థకు రూ.76 కోట్ల నష్టం వాటిల్లనున్నందున కార్మికులు దూరంగా ఉండాలని కోరుతోంది. ఈ నేపథ్యాన కార్మికులు సమ్మెలో పాల్గొంటారా?.. విధులకు హాజరవుతారా? అన్న సందిగ్ధం నెలకొంది.
మే 20వ తేదీనే తొలి పిలుపు..: లేబర్ కోడ్ల రద్దు డిమాండ్‌తో మే 20వ తేదీన సమ్మె చేయాలని తొలుత నిర్ణయించారు. ఆ సమయాన పహల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేయడంతో పాకిస్తాన్ – భారత్ నడుమ నెలకొన్న పరిస్థితులతో వాయిదా వేశారు. మళ్లీ ఈనెల 9న బుధవారం సమ్మెకు సిద్ధౖ మె నెల రోజులుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు.
సింగరేణి సమస్యలు లేవంటూ..: కార్మికుల హక్కుల పరిరక్షణ, సమస్యల పరిష్కారం కోసం జాతీయ కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చినా.. అందులో సింగరేణి సంబంధిత సమస్యలు లేవని యాజమాన్యం చెబుతోంది. ఒకవేళ యాజమాన్యం పరిష్కరించే సమస్యలు ఉంటే.. చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉండేదని ప్రచారం చేస్తోంది. వర్షాకాలం నేపథ్యాన ఇప్పటికే సుమారు 50 లక్షల టన్నుల ఉత్పత్తి వెనుకంజలో ఉండగా.. ఇప్పుడు ఒకరోజు సమ్మె చేస్తే.. మరో 1.90 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యాన కార్మికులు విధులకు హాజరు కావాలని కోరుతున్నారు. ఇదే సమయాన కార్మికులు సమ్మెకు సిద్ధమైతే.. మంగళవారం నైట్ షిఫ్ట్ ఆపరేటర్లను బుధవారం కూడా విధుల్లో కొనసాగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అదీ సాధ్యం కాకపోతే ఇప్పటికే నిల్వ ఉన్న బొగ్గును ఉత్పత్తిగా చూపించాలనే భావనలో ఉన్నట్లు సమాచారం.
సమ్మెకు బీఎంఎస్ దూరం
సమ్మెతో గని కార్మికులు వేతనం కోల్పోవడం తప్ప ఏ లాభం ఉండదు. అందుకే కొన్ని సంఘాలు స్వలాభం కోసం చేస్తున్న సమ్మెలో మేం పాల్గొనడం లేదు. ఈ సమ్మె బీజేపీ ప్రభుత్వంపై కక్షతోనే తప్ప.. కార్మికుల సంక్షేమం కోసం కాదని గుర్తించాలి. – పి.మాధవనాయక్, బీఎంఎస్ నేత
కార్మికుల సత్తా చాటుతాం
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె లో సంఘటిత, అసంఘటిత రంగాల్లో పనిచే స్తున్న 50 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారు. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి కార్మికుల సత్తా తెలియజేస్తాం. అయినా దిగి రాకపోతే రైతుల మాదిరి ఆందోళనలు చేస్తాం. – వాసిరెడ్డి సీతారామయ్య,అధ్యక్షుడు, ఏఐటీయూసీ
స్తంభింపజేస్తాం..
సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు యాజమాన్యం యత్నిస్తోంది. ఒక్క సంఘం చేతిలో ఉంటే ఏ ఫలితం ఉండదు. సమ్మె ద్వారా సింగరేణి వ్యాప్తంగా 16 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీ వెలికితీతను స్తంభింపజేసి కాంట్రాక్ట్ కార్మికుల సత్తా చాటుతాం. – ఎన్.సంజీవ్, రాష్ట నేత, ఐఎఫ్‌టీయూ
కార్మికులు ఆలోచించాలి
సింగరేణిలో ఒక రోజు సమ్మెతో రూ.76 కోట్ల నష్టం వస్తుంది. కార్మికులు రూ.14 కోట్ల వేతనం కోల్పోతారు. 1.90 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతుంది. ఈ విషయాన్ని గుర్తించి కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలి. – ఎల్.వి.సూర్యనారాయణ, డైరెక్టర్ (ఆపరేషన్స్), సింగరేణి