అర్ధ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా?

Munugode BJP Candidate Rajagopal Reddy Criticizes CM KCR And TRS - Sakshi

సాక్షి, చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్‌ పట్టణంలో గురువారం నిర్వహించిన గౌడ ఆత్మీయ సమావేశంలో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సహా పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు రాజగోపాల్‌ రెడ్డి. కేసీఆర్‌కు మతి భ్రమించి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని, ఎన్నికలు వస్తే డబ్బు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మొయినాబాద్‌ ఫామ్‌హౌజ్‌ బేరసారాలు టీఆఎస్‌ చేసిన డ్రామాగా పేర్కొన్నారు. నెత్తి మీద రూపాయి పెడితే అర్థ రూపాయికి కూడా అమ్ముడుపోని వారికి రూ.100 కోట్లా పెడతారా? వాళ్ళను మేము కాదుకదా ఎవరు ఏ పార్టీలోకి రానివ్వరు అని ధ్వజమెత్తారు. 

‘ 8 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుపడలేదు. ఎన్నికలు వస్తే డబ్బు రాజకీయం చేస్తున్నారు. దుర్మార్గమైన పాలన నడుస్తుంది. ప్రశ్నించే గొంతు లేకుండా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు‌ కేసీఆర్. ఇటువంటి ముఖ్యమంత్రికి సరైన జవాబు చెప్పాలి. ఎక్కడ కూడా ప్రజాస్వామ్యం లేదు. టీఆర్ఎస్ పార్టీలో రాజకీయాలు చేసే వారివి బానిస బతుకులు. అవమానాలు భరించలేక బూర నర్సయ్య గౌడ్ బయటకు వచ్చారు. ఎంతోమంది ఉద్యమకారులు ఇప్పుడు ఆ పార్టీలో లేరు. దురహంకార పాలనకు చరమగీతం పాడాలి. ఒక ఎమ్మెల్యేని ఓడ కొట్టడానికి ఆలీబాబా 40 దొంగల ముఠా దిగింది. పోలీస్ జీపులో, ఎస్కార్ట్ జీపులల్లోనే డబ్బులు తీసుకెళుతున్నారు. నీ డబ్బు, నీ అధికారం కంటే ప్రజాశక్తి గొప్పదని హుజూరాబాద్ ప్రజలు నిరూపించారు.’ అని టీఆర్‌ఎస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు రాజగోపాల్‌ రెడ్డి. తెలంగాణ వచ్చింది బడుగు బలహీన వర్గాల కోసమని, ప్రస్తుతం పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రికి పోయే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తం చేశారు రాజగోపాల్‌ రెడ్డి.

ఇదీ చదవండి: ఫాంహౌస్‌ డీల్‌పై వెలుగులోకి షాకింగ్‌ విషయాలు.. రోహిత్‌రెడ్డి ఫిర్యాదులో ఏముంది?

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top