కరోనాతో తల్లీకూతుళ్ల మృతి.. వారం తర్వాత వెలుగులోకి

Mother And Daughter Died With Corona At Nirmal District - Sakshi

సాక్షి, ముథోల్‌: కరోనా మహమ్మారితో నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండలం రాంటెక్‌ గ్రామంలో తల్లీకూతుళ్లు మృతిచెందారు. వారంరోజుల అనంతరం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీఐ అజయ్‌బాబు కథనం ప్రకారం.. రాంటెక్‌ గ్రామానికి చెందిన లక్ష్మీబాయి(70), భారతీబాయి (50) తల్లీకూతుళ్లు. లక్ష్మీబాయి కుమారుడు కూడా వారితోపాటే ఉంటున్నాడు. అయితే అతను గత కొంత కాలంగా మతిస్థిమితం కోల్పోయి ఇల్లు పట్టకుండా తిరుగుతున్నాడు. వారంరోజుల క్రితం తల్లీకూతుళ్లు ఇద్దరూ జ్వరంతో బాధపడుతూ మంచంపట్టారు. కరోనా అని అనుమానించి గ్రామస్తులు ఎవరూ ఆ ఇంటి వైపు వెళ్లలేదు.

కాగా, ఆదివారం వారి ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో గ్రామస్తులు వెళ్లి చూడగా తల్లీకూతుళ్ల మృతదేహాలు కుళ్లిపోయి కనిపించాయి. గ్రామ సర్పంచ్‌ భుజంగరావ్‌ పటేల్‌ ఆధ్వర్యంలో స్థానిక స్వచ్ఛంద సంస్థకు చెందిన యువకులు మృతదేహాలను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అవి కుళ్లిపోయి ఉండడంతో వీలుపడలేదు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందించడంతో వైద్య సిబ్బంది సాయంతో మృతదేహాలను ఇంట్లో నుంచి తీసి గ్రామ పొలిమేరలో దహనం చేశారు. దహనానికి ముందు మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు భైంసా ఏఎస్పీ కిరణ్‌ ప్రభాకర్‌ తెలిపారు. 

చదవండి: (టీకా రెండో డోస్‌ వేసుకున్నాక కోవిడ్‌తో మృతి)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top