కోతులు వచ్చే.. కవర్‌ను చించే.. పెళ్లి నగలు పాయే!

Monkeys Steal Womans Jewellery In Medak - Sakshi

సాక్షి,  నర్సాపూర్‌(మెదక్‌):  పెళ్లికి వెళ్లాలన్న హడావిడిలో ఐదు తులాల నగలను కోల్పోయిన ఉదంతమిది. శనివారం నర్సాపూర్‌ పట్టణానికి చెందిన బాధితుడు వడ్ల నర్సింలు స్థానిక విలేకరులతో మాట్లాడి తన బాధను వివరించారు. ఈ నెల 23న తన మేనకోడలు వివాహం మండలంలోని ఆద్మాపూర్‌ గ్రామంలో ఉండగా అదే రోజు ఉదయం తాను వెళ్లేందుకు పెళ్లికూతురుకు చెందిన రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే ఐదు తులాల బంగారు నగలు ఒక కవరులో పెట్టి దానిని దుస్తుల సంచిలో పెట్టుకుని బైక్‌పై బయలు దేరానని చెప్పారు.

కొంత దూరం వెళ్లాక మరికొన్ని వస్తువులు గుర్తుకురావడంతో వెనుదిరిగి వచ్చినట్లు చెప్పారు. బైక్‌ను ఇంటికి కొద్దిదూరంలో నిలిపి ఇంట్లోకి వెళ్లి వచ్చే సరికి కోతులు బైక్‌పై ఉన్న కవర్‌ను చిందర వందర చేశాయన్నారు. హడావిడిలో దుస్తుల కవర్‌ను సర్దుకొని ఆద్మాపూర్‌కు వెళ్లిన తర్వాత బంగారు నగల కోసం సంచిలో పరిశీలించగా అందులో లేవని తెలిపారు. దీంతో రెడిమేడ్‌ నగలతో పెళ్లి జరిపించామని నర్సింలు చెప్పారు.

కోతులు బంగారు నగల కవరును ఎత్తుకుపోయి కవరును చించితే ఆ ముక్కలు దొరికేవని, చుట్టుపక్కల వెతికినా జాడా దొరకలేదని ఆయన చెప్పారు. 24న తమ ఇంటికి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా తాను బైక్‌పై వెళ్లగానే ఓ ప్రభుత్వ శాఖకు చెందిన కొంతమంది సిబ్బంది అక్కడికి వచ్చి తచ్చాడారని, వారిపైన అనుమానంగా ఉందని నర్సింలు అన్నారు. 25న స్థానిక ఎస్‌ఐ గంగరాజుకు జరిగిన ఘటనను వివరించగా నీ అజాగ్రత్తగా నగలు పోగొట్టుకున్నందున కేసు నమోదు చేయలేనని చెప్పారని ఆయన తెలిపారు. సీసీ కెమెరాలలో రికార్డు అయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకుపోగా సంబధితశాఖ అధికారిని పిలిపించి మాట్లాడగా ఆ అధికారి తమ సిబ్బంది నగలు ఎత్తుకుపోలేదని చెబుతూ నన్నే అనుమానిస్తూ మాట్లాడారని నర్సింలు ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎస్‌ఐ వివరణ.. 
వడ్ల నర్సింలు బంగారు నగలు పోగొట్టుకున్న విషయాన్ని స్థానిక ఎస్‌ఐ గంగరాజుతో ప్రస్తావించగా అతను అజాగ్రత్తగా నగలు పోగొట్టుకున్నందున కేసు నమోదు చేయలేనని చెప్పానన్నారు. నగలు జాగ్రత్తగా పెట్టుకోవాల్సిందని ఆయన చెప్పారు.  

చదవండి:  గదిలో మూత్రం పోశాడని తిట్టింది.. పగ పెంచుకుని

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top