Aleru Molestation News: సెక్యూరిటీ గార్డు గౌస్, సాజియా ఒంటిపై దుస్తులు లేకుండా..

Molestation Harassment On Minor Girl Minority School Aleru - Sakshi

నల్గొండ (ఆలేరు) ‘మైనార్టీ గురుకుల విద్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే గౌస్, సాజియా ఒంటిపై దుస్తులు లేకుండా గడుపుతారు.. ఆడ పిల్లలు స్నానాలు చేస్తున్న గదుల్లోకి గౌస్‌ వచ్చి అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు.. హాస్టల్‌కు కూతవేటు దూరంలో ఉండే స్కూల్‌లో పనిచేసే కొంత మంది సిబ్బంది గది అద్దెకు తీసుకున్నారు.. అక్కడకు తమను పంపించి బలవంతం చేస్తారు. ఈ విషయం బయటికి చెబితే చంపేస్తామని, టీసీలు ఇచ్చి పంపిస్తామని బెదిరిస్తున్నారు.. వీరి బారి నుంచి తమను కాపాడాలి’ అంటూ గుర్తుతెలియని బాలిక యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, ఆలేరు ఎమ్మెల్యేకు, అధికారులకు, విలేకరులకు రాసిన ఉత్తరం వెలుగులోకి రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

మూడు రోజుల క్రితం రాసిన ఉత్తరం ఆదివారం వెలుగులోకి వచ్చినప్పటికీ శనివారమే కళాశాల ప్రిన్సిపాల్‌.. విషయాన్ని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆలేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆలేరు మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూల్లో పనిచేసే కొంతమంది సిబ్బంది బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, లైంగికంగా వేధిస్తున్నారని గుర్తుతెలియని బాలిక రాసిన ఉత్తరం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విద్యాలయంలో 5వ తరగతి నుంచి ఇంటర్‌ మొదటి సంవత్సరం వరకు సుమారు 330మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. 

కాలేజీలో పోలీసుల విచారణ
ఆరోపణల లేఖపై యాదగిరిగుట్ట సీఐ నవీన్‌రెడ్డి ఇతర పోలీస్‌ సిబ్బందితో కలిసి సోమవారం కాలేజీలో విచారణ జరిపారు. కళాశాలలో పనిచేసే ఆసియాపై ఉన్న వ్యక్తిగత కక్షతోనే ఆమె భర్త అనీఫ్‌ విద్యార్థిని పేరిట తప్పుడు లేఖలు సృష్టించాడని తెలిపారు. కళాశాలలో పనిచేసే ఆసియా కుటుంబ సమస్యల వల్లే  ఈ రాద్ధాంతం జరిగిందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఫిర్యాదు మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారించామని, గుండె సంబంధ వ్యాధి ఉందని చెప్పడంతో వదిలేశామని తెలిపారు.  

లేఖ ఓ కుట్ర: ఎమ్మెల్యే సునీత
గుర్తుతెలియని బాలిక రాసిన ఉత్తరం ఓ కుట్ర అని ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. విషయం తెలుసుకున్న ఆమె ఆదివారం కళాశాలను సందర్శించారు. రికార్డులు, సీసీ టీవీ పుటేజీలు పరిశీలించారు. లైంగిక వేధింపులపై ప్రిన్సిపాల్, టీచింగ్, నాన్‌ టీచింగ్‌ సిబ్బందిని, విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమస్యకు కారణమైన ఆసియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. 

కళాశాలనుంచి తొలగించేందుకే..
ఆలేరు మైనార్టీ గురుకుల విద్యాలయంపై వస్తున్న ఆరోపణలు అవాస్తవం. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం. కళాశాలలో అలాంటి ఘటనలు జరగలేదు. కావాలనే ఓ వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని అనుమానిస్తూ సాన్థిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. కళాశాలలో ఆయాగా పనిచేసే ఆసియా భర్త ఇదంతా చేస్తున్నాడు. కళాశాల నుంచి ఆమెను తొలగించేందుకే ఈ లేఖను సృష్టించాడు. దీనిపై శనివారమే ఎమ్మెల్యే, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి దృష్టికి తీసుకెళ్లాం. 
– జహీర్‌ ఉన్నీసా, కళాశాల ప్రిన్సిపాల్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top