
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు.. శుక్రవారం 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు పంపించారు. కాగా, ఆ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
తాజాగా ఎమ్మెల్సీ కవిత.. సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి లేఖ రాశారు. ఇక, ఆ లేఖలో సీబీఐకి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటుగా ఎఫ్‌ఐఆర్ కాపీని తనకు అందించాలని కవిత కోరారు. వీటిని సాధ్యమైనంత త్వరగా తనకు ఇవ్వాలని కవిత కోరారు. సంబంధిత అనుబంధ కాపీలను కూడా అందించాలని కవిత లేఖలో స్పష్టం చేశారు. తన వివరణకు ముందే రెండు డాక్యుమెంట్లను ఇవ్వాలని లేఖ కోరారు. డాక్యుమెంట్లు పంపిన తర్వాతే వివరణ తేదీని ఫిక్స్ చేసి హైదరాబాద్‌లో కలుద్దామని తెలిపారు.
అంతకుముందు.. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ శుక్రవారం రాత్రి నోటీసులు జారీ చేసింది. సీఆర్‌పీసీ 160 కింద నోటీసులు ఇచ్చి.. ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోగానీ, ఢిల్లీలోగానీ ఎక్కడైనా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తనకు సీబీఐ నుంచి నోటీసులు అందిన మాట వాస్తవమేనని కవిత చెప్పారు. హైదరాబాద్‌లోని తన నివాసంలోనే విచారణకు హాజరవుతానని సీబీఐ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు.