
రేపట్నుంచే హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు
గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభ కార్యక్రమం
పోటీలకు బందోబస్తు సహా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసిన ప్రభుత్వం
ఇప్పటికే నగరానికి చేరుకున్న 100 మందికి పైగా అందగత్తెలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రపంచ సుందరి (మిస్ వరల్డ్) పోటీలకు సమయం ఆసన్నమైంది. శనివారం సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంలో అంగరంగ వైభవంగా ఈ పోటీలు ప్రారంభం కానున్నాయి. మిస్ వరల్డ్ సంస్థతో కలిసి ప్రభుత్వం.. ఈ పోటీలు నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పోటీల నిర్వహణ ద్వారా తెలంగాణ రాష్ట్రం ప్రపంచ పటంపై ప్రత్యేక స్థానం పొందుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
విదేశీ ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కల్పించడం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేసే ప్రయత్నం చేస్తోంది. ప్రపంచ దేశాల సుందరీమణులతో పాటు అంతర్జాతీయ మీడియా సైతం రానుండటంతో రాష్ట్ర రాజధాని నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ధింది. పటిష్ట భద్రత సహా అన్ని ఏర్పాట్లు దాదాపు పూర్తి అయినట్లు అధికరావర్గాలు వెల్లడించాయి.
పలు దఫాలుగా సీఎం సమీక్షలు
రాష్ట్ర ప్రతిష్టను పెంచేందుకు, పెట్టుబడుల ఆకర్షణకు అందాల పోటీలను వినియోగించుకోవాలని భావిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి.. వీటిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే పలు దఫాలుగా సమీ క్షలు నిర్వహించారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను సమీక్షించడంతో పాటు, కార్యక్రమా లు జరిగే ప్రదేశాలను కూడా సందర్శించారు. కంటెస్ట్‌లతోనూ ఒకసారి భేటీ అయ్యారు. పర్యాటకాభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు.
అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ప్రకృతి, పర్యా వరణ పరంగా అన్ని హంగులు ఉన్నా, తెలంగాణ ఆ రంగంలో వెనుకబడిందని భావిస్తున్న ప్రభుత్వం.. ఇకపై ‘తెలంగాణ జరూర్ ఆనా’(తప్పకుండా తెలంగాణ రండి) అనే నినాదాన్ని ప్రపంచవ్యాప్తం చేయా లని నిర్ణయించింది. తద్వారా పర్యాటక రంగం అభివృద్ధి చెందడంతో పాటు పెట్టుబడుల సాధన, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తోంది.
సర్వాంగ సుందరంగా నగరం
ఈ పోటీల్లో పాల్గొనడానికి దాదాపు 100 మందికి పైగా సుందరీమణులు ఇప్పటికే నగరానికి చేరుకున్నారు. నిర్వహణ సంస్థ మిస్ వరల్డ్ లిమిటెడ్‌కు చెందిన 28 మంది ప్రతినిధులు, మరో 17 మంది సహాయకులు కూడా వచ్చేశారు. రానున్న రెండురోజుల్లో మరికొంత మంది ప్రతినిధులు వివిధ దేశాల నుంచి వస్తారని నిర్వాహకులు తెలిపారు. అధికారులు నగరానికి చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా.. ఇతర రాష్ట్రాల్లోని ప్రముఖ విమానాశ్రయాల్లో కూడా ప్రపంచ సుందరి పోటీలకు వచ్చే వారికి ఆహ్వానం పలుకుతూ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయించింది.
గత వారం రోజులుగా వస్తున్న అతిథులు అందరికీ తెలంగాణ సంస్కృతీ, సాంప్రదాయాలకు అనుగుణంగా స్వాగతం పలుకుతున్న పర్యాటక శాఖ, వారి బసకు అవసరమైన ఏర్పాట్లను కూడా చేసింది. విదేశీ ప్రతినిధులు బస చేసిన ట్రైడెంట్ హోటల్ దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రధాన కూడళ్లను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
అలరించిన రిహార్సల్స్
ప్రపంచ సుందరి పోటీల కోసం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో గురువారం రిహార్సల్స్ ఉత్సాహంగా కొనసాగాయి. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న వివిధ దేశాల పోటీదారులు ఆకర్షణీయమైన వ్రస్తాలు ధరించి ర్యాంప్ వాక్ చేశారు. తమ ప్రతిభకు తగిన కార్యక్రమాలను ఎంపిక చేసుకుని ప్రాక్టీస్ చేశారు. ఇక సమయాను కూలంగా స్టేజ్ ఎంట్రీలు, గ్రూప్ మూవ్‌మెంట్స్, లైటింగ్, మ్యూజిక్ సెట్ అప్ తదితర అంశాలను నిర్వాహకులు పరిశీలించారు. ప్రధాన కార్యక్రమానికి ముందస్తుగా ప్రతి అంశాన్ని శ్రద్ధగా పరిశీలిస్తూ రిహార్సల్స్ పూర్తిచేశారు.
సామాన్యులకూ వీక్షించే చాన్స్
నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ నెలా ఖరు వరకు జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని పరిమిత సంఖ్యలో సామాన్యులకూ కల్పించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టూరిజం వెబ్‌సైట్ ( https://tourism.telangana.gov. in/events&single/miss& world& event)లో రిజిస్టర్ చేసుకున్న వారికి పోటీలు జరిగే ఒక్కో కేంద్రంలో వెయ్యి మంది చొప్పున మొత్తం 5 కేంద్రాల్లో 5వేల మందికి మిస్ వరల్డ్ పోటీలను వీక్షించే అవకాశం కల్పించాలని భావిస్తున్నారు.