ఊపందుకున్న ప్రచార పర్వం
మారుతున్న రాజకీయ సమీకరణలు
సాక్షి, హైదరబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. సర్వేల పేరిట మౌత్ టాక్ ఓటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రధాన పక్షాలు ప్రత్యర్థుల బలహీనతలను ప్రచారాస్త్రాలుగా చేసుకొని ఓటర్ల ఆలోచన విధానంలో మార్పు తేచ్చేందుకు పాట్లు పడుతున్నాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాలతో బలమైన సామాజిక వర్గాలను అనుకూలంగా తమకు మల్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఆయా పక్షాల అగ్రనేతలు ప్రచార రంగంలోకి దిగడంతో మాటలు తూటాలు పేలుతున్నాయి. రోడ్ షోలు, కార్నర్ సభలకు పోటాపోటీగా జనసమీకరణలతో ప్రచార పర్వం ఊపందుకుంది. మరోవైపు క్షేత్ర స్థాయిలో ఓటర్లను గాలం వేసే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ప్రధాన పక్షాల బూత్‌ల వారీగా బాధ్యులు ఓటరు స్లిప్‌లు పంపిణీ చేస్తుండగా, మరో పక్షం మాత్రం దూకుడు పెంచి స్లిప్‌తో పాటు కొంత నగదు అడ్వాన్స్‌గా అందిస్తునట్లు ప్రచారం సాగుతోంది.   
కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం..  
అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ఇజ్జత్‌గా సవాల్ తీసుకొని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నా.. మారుతున్న ప్రజానాడిని సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థుల మౌత్ టాక్ ప్రభావం ఓటర్లపై పడకుండా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి  ఉప ఎన్నికను ఆషామాïÙగా తీసుకోవద్దని పార్టీ భవిష్యత్ దృష్ట్యా బూత్ స్థాయి మేనేజ్‌మెంట్ పకడ్బందీగా జరిగేలా చర్యలు చేపట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. 
అధికారంలో వచ్చిన తర్వాత రెండో ఉప ఎన్నిక కావడంతో కంటోన్మెంట్ మాదిరిగా జూబ్లీహిల్స్‌లో గెలుపు బావుటా ఎగురవేసి పరువు దక్కించుకునేందుకు ముమ్మరం ప్రయత్నాలు చేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జూబ్లీహిల్స్ ఫలితాన్ని రెండేళ్ల పాలనపై ప్రజా తీర్పుగా చూపించే వ్యూహంతో అడుగులు వేస్తోంది. ఏ చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా పావులు కదుపుతోంది.  నియోజక వర్గంలో గత పదేళ్ల వైఫల్యాలను ఎత్తిచూపుతూ అభివృద్ధి సెంటిమెంట్‌ను ప్రజల్లోకి చొప్పించే ప్రయత్నం చేస్తోంది.
వ్యూహాత్మకంగా బీఆర్‌ఎస్..  
బీఆర్‌ఎస్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పార్టీ భవిష్యత్తుతో ముడిపెట్టి చావోరేవోగా పరిగణిస్తోంది. ప్రత్యర్థుల మౌత్ టాక్‌కు అడ్డకట్ట వేసి ఎదురుదాడితో ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రయత్నాలు చేస్తోంది. ప్రధానంగా రెండేళ్లలో ఆరు గ్యారంటీల బాకీ కార్డు ప్రయోగిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత రెండో ఉప ఎన్నిక కావడంతో కంటోన్మెంట్ మాదిరిగా కాకుండా సిట్టింగ్ స్థానం పదిలం చేసుకొని పార్టీ బంగారు భవిష్యత్‌కు సంకేతం ఇవ్వాలని భావిస్తోంది. మూడు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన సిట్టింగ్ స్థానం కావడంతో సానుభూతితో గట్టి ఓటు బ్యాంక్ పదిలపర్చుకునేందుకు వ్యూహాత్మకంగా పావులుకదుపుతోంది. పార్టీ యంత్రాంగాన్ని  మొత్తం రంగంలో దింపి రెండేళ్ల కాంగ్రెస్ వైఫల్యాలను ప్రధాన ప్రచారా్రస్తాలుగా సంధిస్తోంది.  
పట్టు కోసం కమలదళం 
జూబ్లీహిల్స్‌లో పాగా వేసేందుకు బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ప్రధాని మోదీ చరిష్మా, హిందూత్వ ఎజెండా ప్రయోగిస్తూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడింది. రాష్ట్రంలో టార్గెట్– 2028గా పావులు కదుపుతున్నా... పత్యర్థులకు దీటుగా ప్రచారంలో మాత్రం వెనుకబడినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్ కావడంతో ఎన్నికల ప్రచారాన్ని తన భుజస్కంధాలపై వేసుకున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు, మజ్లిస్‌తో కాంగ్రెస్ మిలాఖత్‌పై ప్రచారంతో ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు.   

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
