1,125 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు ఓకే

Ministry Of Medicine And Health Decided New Assistant Professor Posts For Medical Colleges - Sakshi

మెడికల్‌ కాలేజీల్లో భర్తీ చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయం 

మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా భర్తీకి సన్నాహాలు 

అనుమతి కోరుతూ సర్కారుకు ప్రతిపాదన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల కోసం కొత్తగా 1,125 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీ చేపట్టాలని వైద్య, ఆరోగ్య శాఖ నిర్ణయించింది. త్వరలో పీజీ, ఎంబీబీఎస్‌ మొదటి ఏడాది తరగతులు ప్రారంభం కానున్నాయి. అలాగే వచ్చే ఏడాది నుంచి మరో ఎనిమిది మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో భర్తీ ప్రక్రియ చేపట్టనుంది. ఇప్పటికే ఎనిమిది కొత్త మెడికల్‌ కాలేజీల కోసం తాత్కాలిక భర్తీ ప్రక్రియ జరుగుతోంది.

కొందరిని డిప్యుటేషన్‌పై తీసుకున్నారు. కొందరికి పదోన్నతులు కల్పించడం ద్వారా నియమించారు. కాగా, 1,125 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రక్రియ చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని వైద్య విద్య డైరెక్టర్‌ (డీఎంఈ) ప్రభుత్వానికి ప్రతిపాదించారు. మెడికల్‌ కాలేజీల్లో బోధన సిబ్బంది, ఇతర మౌలిక వసతులను పరిశీలించేందుకు కేంద్ర బృందం రానున్న నేపథ్యంలో వేగంగా భర్తీ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు.  

మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారానే.. 
గతంలో మెడికల్‌ పోస్టులను రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా భర్తీ చేసేవారు. అయితే టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ ప్రక్రియ ఆలస్యం కావడంతో సమస్యలు వస్తున్నాయి. దీంతో వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఆర్‌బీ)ను ఏర్పాటు చేసింది. ఈ బోర్డు ద్వారానే వైద్య పోస్టులను భర్తీ చేయాలని వైద్య శాఖ నిర్ణయించింది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు మొదలు బోధనాసుపత్రుల వరకు అన్నిచోట్లా పోస్టుల మంజూరు నుంచి భర్తీ వరకు మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డే చూస్తుంది. రిటైర్‌మెంట్లు, ఖాళీలు ఏర్పడగానే సంబంధిత సమాచారం బోర్డుకు చేరుతుంది. బోర్డు ఆదేశం మేరకు వాటికి నోటిఫికేషన్‌ విడుదలవుతుంది.

ఇప్పటివరకు కొన్ని పోస్టులను మాత్రమే ఈ బోర్డు ద్వారా భర్తీ చేశారు. అయితే అనుకున్నట్లు ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ జరగట్లేదన్న విమర్శలున్నాయి. కాగా, తాజాగా 1,125 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను కూడా మెడికల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారానే భర్తీ చేయాలని నిర్ణయించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top