త్వరలో సాదాబైనామాల క్రమబద్ధీకరణ 

Minister Vemula Speaks Over Land Regularisation And Patta Pass Books - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాదాబైనామాలకు సంబంధించి భూయజమానులకు త్వరలోనే క్రమబద్ధీకరించి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వనున్నట్టు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం పద్దులపై చర్చ సందర్భంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లకు సంబంధించి సభ్యుల సందేహాలను నివృత్తి చేసే క్రమంలో ఆయన పలు వివరాలు వెల్లడించారు. తెలంగాణలో భూ వివాదాలకు అవకాశం లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే సాదాబైనామాలకు సంబంధించి క్రమబద్ధీకరణ చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. భూ విక్రయ లావాదేవీలకు సంబంధించి తెల్లకాగితాలపై రాసుకున్నవారి వివరాలు రికార్డుల్లోకెక్కలేదని, యజమానులైనప్పటికీ రికార్డుల్లో వారి పేర్లు లేకపోవడంతో వివాదాలకు అవకాశం కలుగుతోందన్నారు. 

ఇలాంటి వారు క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించగా తొలుత 15.68 లక్షల దరఖాస్తులు వచ్చా యని, వీటిల్లో 6.18 లక్షలను క్లియర్‌ చేసినట్లు వెల్లడిం చారు. ఆ తర్వాత 2 దఫాలు గా అవకాశం ఇవ్వగా మరో 9 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఈ అంశానికి సంబంధించి కోర్డులో కేసు దాఖలు కావటంతో క్రమబద్ధీకరణ పెండింగ్‌లో పడిందన్నారు. కోర్టు కేసు క్లియర్‌ కాగానే రెగ్యులరైజేషన్‌ ప్రక్రియ ప్రారంభిస్తామని సభకు వివరించారు. భూ రిజిస్ట్రేషన్‌లో ఎవరి జోక్యం లేకుండా, అంతా ఆన్‌లైన్‌ విధానంతో జరిగేలా రూపొందించిన ధరణి పోర్టల్‌ రైతులకు పెద్ద వరంలాంటిదన్నారు. ధరణి వ్యవహారం ఓ చరిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. 

రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు అద్భుతం..
రాష్ట్రంలో ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని సమకూర్చిపెట్టే మూడు ప్రధాన శాఖల్లో ఒకటైన రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరు అద్భుతమని మంత్రి కొనియాడారు. కేవలం 1,300 సిబ్బందితో ఈ శాఖ, రాష్ట్రంలో సంక్షేమ పథకాలు సజావుగా సాగేందుకు వీలుగా నిధులను సమకూర్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కోవిడ్‌తో గత ఆర్థిక సంవత్సరం ఇబ్బంది ఉండగా, అంతకుముందు యేడు 1,300 మంది సిబ్బంది, 141 కార్యాలయాల ద్వారా 15.34 లక్షల భూలావాదేవీలతో రూ.6,620 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టిం దన్నారు. త్వరలో రాష్ట్రంలో సమగ్ర భూసర్వే నిర్వహించనున్నామని, పార్ట్‌–బీలో ఉన్న వివాదాలను మొదటి దశలోనే పరిష్కరిస్తామని, ఇందుకు బడ్జెట్‌లో రూ.400 కోట్లు ప్రతిపాదించినట్టు పేర్కొన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top