
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై మంత్రి ఉత్తమ్
హుజూర్‌నగర్: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే రీడిజైన్ చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వారి హయాంలోనే కూలిపోయిందన్నారు.
అప్పట్లోనే కూలిపోయినా నోరు మెదపని ఆ నాయకులు విచారణ కమిషన్ నోటీసులిచ్చే సరికి రకరకాలుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని తన నివాసంలో ఉత్తమ్ విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత సీఎం రాజశేఖరరెడ్డి హయాంలో తుమ్మిడి హెట్టి వద్ద డిజైన్ చేసిన అంబేడ్కర్ చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు రూ.38 వేల కోట్లతో పూర్తయ్యేదని, అది పూర్తి అయితే కాంగ్రెస్‌కు ఎక్కడ మంచి పేరు వస్తదో అని రాజకీయ దురుద్దేశంతో బీఆర్‌ఎస్‌వారు కట్టలేదని దుయ్యబట్టారు.
రూ.38 కోట్లతో అయ్యేదానిని అదే ఆయకట్టుకు రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టారన్నారు. తుమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి ఒక చిన్న లిఫ్ట్ గ్రావిటీ ద్వారా వచ్చే నీళ్లను కాదని వాళ్లు తలపెట్టిన మూడు పెద్ద లిఫ్ట్‌లను కట్టడంతో ఏటా రూ.10 వేల కోట్లు కరెంటు బిల్లు వస్తోందన్నారు. ఆ పెద్ద మనిషి విమానంలో ప్రయాణిస్తూ ఇక్కడ ప్రాజెక్టు కట్టు, ఇక్కడ కాలవలు తీయ్ అని ప్రణాళికలు చేయడం వల్లనే మేడిగడ్డ కూలిపోయిందంటూ కేసీఆర్‌ను ఉద్దేశించి విమర్శించారు.