పరిశోధనల్లోనూ అగ్రగామి కావాలి

Minister Mansukh Mandaviya Inaugurates New Facilities At NARFBR in Hyderabad - Sakshi

కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ 

నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ ఫెసిలిటీ ప్రారంభించిన మంత్రి  

పరిశోధనలకు అవసరమయ్యే జంతువులను సమకూర్చనున్న రిసోర్స్‌ ఫెసిలిటీ  

సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచ ఫార్మసీ రాజధానిగా ఎదిగిన భారత్‌.. శాస్త్ర పరిశోధనల రంగంలోనూ అంతర్జాతీయ కేంద్రంగా ఎదిగేందుకు కృషి చేస్తోందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు. ప్రపంచ జనాభా తీసుకునే ప్రతి ఆరు మాత్రల్లో ఒకటి భారత్‌లో తయారవుతోందని.. అగ్రరాజ్యం అమెరికా విషయానికి వస్తే ప్రతి నాలుగు మాత్రల్లో ఒకటి ఇక్కడ తయారైన జెనరిక్‌ మాత్ర అని ఆయన వెల్లడించారు.

శనివారం హైదరాబాద్‌ శివారులోని జినోమ్‌ వ్యాలీలో వంద ఎకరాల విస్తీర్ణంలో ఏర్పా­టు చేసిన ‘‘నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ ఫెసిలిటీ ఫర్‌ బయో మెడికల్‌ రీసెర్చ్‌’’ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధన రంగంలో అగ్రగామిగా మారేందుకు దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల పరిశోధనశాలల్లో ప్రైవేట్‌ రంగం కూడా పరిశోధనలు నిర్వహించేందుకు అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు.

అదే సమయంలో అవసరాన్ని బట్టి ప్రైవేట్‌ సంస్థల్లోని సౌకర్యాలను వాడుకునేందుకు ప్రభుత్వ సంస్థలకూ అవకాశం ఉండేలా చూస్తామని చెప్పారు. పరిశోధనలకు పెద్ద ఎత్తున వేర్వేరు జాతుల జంతువులు అవసరమవుతాయని, నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ ఫెసిలిటీ ఫర్‌ బయో మెడికల్‌ రీసెర్చ్‌ ఈ అవసరాన్ని తీరుస్తుందని కేంద్ర మంత్రి వివరించారు. ఇది దేశంలోనే అతిపెద్ద వ్యవస్థ అని, ఎలుకలు మొదలుకొని గుర్రాల వరకూ పలు రకాల జంతువులను పెంచి పోషించేందుకు ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఇది నిలుస్తుందని పేర్కొన్నారు.

కోవిడ్‌ సమయంలో దేశంలోని ప్రతి ఒక్కరూ పరిశోధనలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తించారని అన్నారు. ఇందుకు తగ్గట్టుగా కరోనా వైరస్‌ కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో పూర్తిస్థాయి స్వదేశీ టీకా తయారైన విషయాన్ని మంత్రి గుర్తు చేశా­రు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు దేశంలోని అన్ని ఎయిమ్స్‌ ఆసుపత్రుల్లో సమీకృత వైద్యవిధానం కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పా­రు. ఆయుర్వేదంతోపాటు అన్ని రకాల వైద్యపద్ధతుల్లో మెరుగైన వైద్యం అందించడం దీని లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ రాజీవ్‌ భాల్‌  పాల్గొన్నారు.  

ఎన్‌ఐఎన్‌కు మంత్రి మాండవీయ 
కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌)ను సందర్శించారు. సంస్థలోని వివిధ విభాగాల్లో జరుగుతున్న పరిశోధనల గురించి అక్కడి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నా­రు. ఈ సందర్భంగా ఆయన ‘డైట్‌ అండ్‌ బయోమార్కర్‌ స్టడీ’ని ప్రారంభించారు. దేశం­లోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వివిధ వర్గాల ఆహారపు అలవాట్ల నమోదు, దేశవ్యాప్తంగా ఆహారం, పోషకాల కొరతను గుర్తించడం ఈ అధ్యయనం ముఖ్యఉద్దేశం.

ఈ అధ్యయనం ద్వా రా రక్తహీనత సహా పలు పోషక లోపాల సమాచారం తెలుస్తుందని ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ ఆర్‌.హేమలత తెలిపారు.దేశంలో తొలి సా రి వివిధ ప్రాంతాల్లో వండిన ఆహారం, వండని ఆహారంలో ఉండే పోషకాలను గుర్తించేందుకు ఈ అధ్యయనం ద్వారా ప్రయత్నం చేస్తున్నామని హేమలత వివరించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top