ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్‌గా నల్లమల  | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్‌గా నల్లమల 

Published Sat, Jan 21 2023 1:16 AM

Minister Indrakaran Reddy Visited Amrabad Tiger Reserve in Nagarkurnool - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌: అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని, అందులో భాగంగా  ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్‌గా నల్లమల అటవీ ప్రాంతాన్ని తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. అటవీ శాఖ చేపట్టిన ప్రత్యేక కార్యక్రమాలతో రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పారు.

శుక్రవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ ప్రాంతంలో మంత్రి పర్యటించారు. రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, పీసీసీఎఫ్‌ రాకేశ్‌ మోహన్‌ డోబ్రియాల్‌తో కలసి మన్ననూరులో కొత్తగా నిర్మించిన ట్రీహౌస్, అదనపు కాటేజీలతోపాటు 8 సఫారీ వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ అమ్రాబాద్, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ల్లోని పులుల సంరక్షణపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.

అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌లో 2018లో 12గా ఉన్న పులుల సంఖ్య 2021లో 21కి పెరిగినట్టు తెలిపారు. వన్యప్రాణులను వేటాడే వారిపై పీడీ యాక్ట్‌ నమో దు చేస్తున్నామని, సమాచారం తెలిపిన వారికి బహుమతులు ఇస్తున్నామని చెప్పారు. పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్‌ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారని చెప్పారు.

ఎకో టూరిజంలో భాగంగా ప్యాకేజీలు.. 
టైగర్‌ స్టే ప్యాకేజీలో భాగంగా రెండ్రోజులు అడవిలో ఉండి టైగర్‌ సఫారీతోపాటు ట్రెక్కింగ్, కాటేజీల్లో బస చేసే అవకాశం కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. ఇప్పటికే ఉన్న కాటేజీలకు మరో ఆరు కాటేజీలతోపాటు ఇటీవల నిర్మించిన ట్రీహౌస్‌æ కాటేజీ ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. ఈనెల 26 నుంచి టైగర్‌ స్టే ప్యాకేజీ అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వెబ్‌సైట్‌లో బుకింగ్‌ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు.

సాధారణ కాటేజీలో ఇద్దరికి రూ.4,600, మడ్‌ హౌస్‌లో రూ. 6 వేలు, ట్రీ హౌస్‌లో రూ. 8 వేలతో ప్యాకేజీని ఖరారు చేశామన్నారు. బుకింగ్‌ల కోసం www.amrabadtigerreserve.com సంప్రదించొచ్చన్నారు. పులుల అభయారణ్యాల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి పునరావాసం కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని పీసీసీఎఫ్‌ రాకేశ్‌ మోహన్‌ డోబ్రీయాల్‌ చెప్పారు. కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీ రాములు, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు కలెక్టర్‌ ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement