ప్రీతి ఆత్మహత్య కేసు.. సైఫ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

Medico Preethi Suicide Case: Key Facts On Saif Remand Report - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్యార్థిని ధరావత్‌ ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన సైఫ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సైఫ్‌ ఫోన్‌లో 17 వాట్సాప్‌ చాట్స్‌ను పోలీసులు పరిశీలించారు. అనుషా, భార్గవ్‌, ఎల్‌డీడీ+నాక్‌ అవుట్స్‌(LDD+knockout) గ్రూప్‌ చాట్స్‌ స్వాధీనం చేసుకున్నారు. అనస్థీషియా విభాగంలో ప్రీతి సుపర్‌ వైజర్‌గా సైఫ్‌ ఉండేవాడని.. రెండు ఘటనల ఆధారంగా ఆమెపై కోపం పెంచుకున్నట్లు రిమాండ్‌ రిపోర్టు ద్వారా వెల్లడైంది. డిసెంబర్‌లో ఓ యాక్సిడెంట్‌ కేసులో  ప్రీతిని సైఫ్‌ గైడ్‌ చేసినట్లు తెలిసింది.

ఆ ఘటనలో ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టు రాయగా.. ఆమె రాసిన రిపోర్టును వాట్సాప్‌ గ్రూపుల్లో హేళన చేశాడు. రిజర్వేషన్‌లో ఫ్రీ సీట్‌ వచ్చిందంటూ అవమానించాడు. తనతో ఏమైనా ప్రాబ్లమ్‌ ఉంటే హెచ్‌ఓడీకి చెప్పాలని ప్రీతి.. సైఫ్‌కు వార్నింగ్‌ ఇచ్చింది. దీంతో ప్రీతిని వేధించాలని సైఫ్‌.. భార్గవ్‌కు చెప్పాడు. ఆర్‌ఐసీయూలో రెస్ట్‌ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని చెప్పాడు. దీంతో గత నెల 21న హెచ్‌ఓడీ నాగార్జునకు ప్రీతి ఫిర్యాదు చేసింది. డాక్టర్లు మురళి, శ్రీకళ, ప్రియదర్శిని సమక్షంలోప్రీతి సైఫ్‌లకు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడింది’ అని సైఫ్‌ రిమాండ్‌ రిపోర్టులో తేలింది.

కాగా, సీనియర్‌ వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసిన ప్రీతి చికిత్స పొందుతూ  ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.  అయిదు రోజులు మృత్యువుతో పోరాడి కన్నుమూసింది.  మరోవైపు నిందితుడు మెడికల్‌ పీజీ సీనియర్‌ విద్యార్థి సైఫ్‌పై వరంగల్‌ మట్టెవాడ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడిని ఈ నెల 24న అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తి అతడికి 14 రోజులు రిమాండ్‌ విధించడంతో ప్రస్తుతం ఖమ్మం జైలులో విచారణ ఖైదీగా ఉన్నాడు. మరోవైపు సైఫ్‌ను ఎంజీఎం ఆస్పత్రి విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. నేరం రుజువైతే మెడికల్‌ కాలేజీ నుంచి సస్పెండ్‌ చేస్తామని ప్రకటించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top