కుండీ దోమ కుట్టేసె! దోమలకు నిలయాలివే.. 

Medical Experts Says That Dengue Mosquitoes Will Come To Money Plants - Sakshi

 ఇళ్ల ఆవరణలో మనీప్లాంట్లు, పూల మొక్కలు

డెంగీ దోమలకు నిలయంగా కుండీలు

దేశంలోనే హైదరాబాద్‌లో అత్యధిక కేసులు

శివారు మున్సిపాలిటిల్లోనూ ఇదే పరిస్థితి

రెండువారాల్లో గాంధీలో ఇద్దరు చిన్నారుల మృతి

ప్లేట్‌ లెట్స్‌కు మళ్లీ పెరిగిన డిమాండ్‌

చికిత్సల పేరుతో కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రుల దోపిడీ

సాక్షి, హైదరాబాద్‌: ఆ మొక్క పేరు మనీ ప్లాంట్‌. ఇంటి ఆవరణలో ఇది పెంచితే సంపద సంప్రాప్తిస్తుందని కొందరి నమ్మకం. డబ్బు మాటేమోగానీ ఈ ప్లాంట్‌తో డెంగీ దోమలు కచ్చితంగా వచ్చి తీరుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందం, ఆహ్లాదం కోసం సిటీజనులు పెంచుతున్న పూలు, తీగజాతి మొక్కలు.. వాటి కోసం ఏర్పాటు చేసిన పూల కుండీలు ప్రస్తుతం డెంగీ దోమలకు నిలయంగా మారుతున్నాయడంలో అతిశయోక్తి లేదేమో. హైదరాబాద్‌ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు దేశంలోనే అత్యధికంగా 537 డెంగీ కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆ తర్వాత స్థానాల్లో రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లా లు ఉన్నాయి. సాధారణంగా పారిశుద్ధ్య లోపం ఎ క్కువగా ఉన్న  మూసీ పరీవాహక ప్రాంతాల్లో డెంగీ జ్వరాలు రావాలి కాని.. సంపన్నులు ఎక్కువగా నివసించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ వంటి ప్రాంతాల్లో నమోదవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది.  
చదవండి: మీ ఇష్టం.. గణేష్‌ విగ్రహాల విషయంలో ఆంక్షల్లేవ్‌ 

30 శాతం కేసులు అక్కడే..  
► ప్రస్తుతం హైదరాబాద్‌ సహా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలో నమోదైన కేసుల్లో 30 శాతం సంపన్నులు అధికంగా నివాసం ఉండే ప్రాంతాల్లోనే నమోదయ్యాయి. ముఖ్యంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బేగంపేట్, యూసఫ్‌గూడ, సికింద్రాబాద్‌లలో నమోదైనట్లు వైద్యులు అభిప్రాయపడుతున్నారు. 
►పేద, మధ్య తరగతి ప్రజలతో పోలిస్తే సంపన్నుల నివాసాలు విశాలంగా ఉంటాయి. వీరు ఇంటి ఆవరణలో అందం, ఆహ్లాదకర వాతావరణం కోసం మనీప్లాంట్లు, రకరకాల పూల మొక్కలు పెంచుకుంటారు. వీటికోసం భారీ కుండీలను ఏర్పాటు చేస్తుంటారు. వర్షపు నీరు వీటిలో చేరి రోజుల తరబడి నిల్వ ఉంటుంది.  
► వీటిలో డెంగీ దోమలు గుండ్లు పెట్టి వాటి వృద్ధికి కారణమవుతున్నట్లు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త కాలనీలు, నిర్మాణాలు, సెల్లార్లు ఎక్కువగా ఉన్న శివారు ప్రాంత మున్సిపాలిటీల్లోనూ డెంగీ కేసులు భారీగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  
చదవండి: World Mosquito Day: ఫీవర్‌ సర్వేలో.. డెంగీ కలకలం.. 

గుర్తించినట్టు.. పెన్సిల్‌తో రాసి.. 
► దోమల నియంత్రణ చర్యలు చేపడుతున్నట్లు జీహెచ్‌ఎంసీ చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని సిటీజన్లు ఆరోపిస్తున్నారు. 
► వారానికోరోజు కూడా ఫాగింగ్‌ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఇంటింటికీ తిరిగి యాంటిలార్వా మందును పిచికారీ చేయాల్సిన జీహెచ్‌ఎంసీ సిబ్బంది.. మంచినీటి  ట్యాంకుల్లో మందు చల్లకుండానే చల్లినట్లు ఇంటిగోడలపై పెన్సిల్‌తో రాసి చేతులు దులుపుకొంటున్నట్లు ఆరోపణలు లేకపోలేదు. 
►రెండు వారాల్లోనే గాంధీ ఆస్పత్రిలో డెంగీతో 54 మంది చిన్నారులు ఆస్పత్రిలో చేరారు. వీరిలో ఇద్దరు డెంగీ షాకింగ్‌ సిండ్రోమ్‌తో (బాలిక, బాలుడు) మృతి చెందారు.నిలోఫర్‌ ఆస్పత్రిలో రోజుకు కనీసం 20 నుంచి 30 డెంగీ కేసులు నమోదవుతున్నట్లు సమాచారం.

దోమలకు నిలయాలివే..   
►  ఇంటి ఆవరణలోని పూల కుండీలు 
► మనీప్లాంట్స్, ఇతర చెట్ల పొదలు 
► టైర్లు, ఖాళీ సీసాలు, కొబ్బరి బోండాలు 
►  ఇంటిపై మూతల్లేని నీటి ట్యాంకులు 
► కొత్త నిర్మాణాలు, సెల్లార్లు 
► తాళం వేసిన నివాసాలు 
► విద్యా సంస్థలు, ఫంక్షన్‌ హాళ్లు 
► ముంపు ప్రాంతాల్లో నిల్వ నీరు 

గాందీలో 40 మంది డెంగీ బాధితులకు చికిత్స 
గాంధీ ఆస్పత్రి: మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మహమ్మారి కరోనాకు తోడుగా డెంగీ వ్యాధి పంజా విసురుతోంది. డెంగీ లక్షణాలతో సికింద్రాబాద్‌ గాం«దీ ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం గాంధీలో 40 మంది డెంగీ బాధితులకు  వైద్యసేవలు అందిస్తున్నారు. వీరిలో సింహభాగం చిన్నారులే కావడం గమనార్హం. గత నాలుగు రోజులుగా డెంగీ లక్షణాలతో వచ్చిన మరో 16 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. చిన్నారుల్లో ముగ్గురుకి డెంగీతోపాటు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. గాంధీ పిడియాట్రిక్‌ వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారి మూడు రోజుల క్రితం డెంగీ షాక్‌ సిండ్రోమ్‌తో మృతి చెందింది. 

అందుబాటులో ప్లేట్‌లెట్లు, మందులు  
గాంధీ ఆస్పత్రిలో డెంగీ వ్యాధి నివారణకు అన్నిరకాల మందులు, ప్లేట్‌లెట్లు అందుబాటులో ఉన్నాయని సూపరింటెండెంట్‌ ప్రొఫెసర్‌ రాజారావు తెలిపారు. సుమారు 40 మంది డెంగీ బాధితులకు ఇక్కడ వైద్య సేవలు అందిస్తున్నామని, వారం రోజులుగా డెంగీ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.  

ఇప్పటివరకు డెంగీ కేసులు  
హైదరాబాద్‌    537
రంగారెడ్డి    140 
మేడ్చల్‌    120 
వికారాబాద్‌    45

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top