మేడారంలో విషాదం.. తల్లీ ఇక సెలవు.. అనారోగ్యంతో సమ్మక్క పూజారి మృతి

Medaram Priest sSambasiva Rao Passed Away Due To Illness - Sakshi

సాక్షి, ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మేడారం గ్రామానికి చెందిన సమ్మక్క పూజారి సిద్దబోయిన సాంబశివరావు(40) అనారోగ్యంతో మృతి చెందాడు. మేడారానికి చెందిన సాంబశివరావు ఇటీవల ఆనారోగ్యానికి గురయ్యాడు. బుధవారం ఉదయం శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో ఆయనను కుటుంబ సభ్యులు  ఏటూరునాగారంలోని సామాజిక ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా ఆరోగ్య పరిస్థితి విషమించి మృతి చెందాడు. ప్రతి ఏటా మహాజాతరలో సమ్మక్కను చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెపైన ప్రతిష్టించేంత వరకు బూర కొమ్ము శబ్దం ఊదుతూ కీలక పాత్ర పోషించేవాడు. జాతర ప్రారంభం నుంచి తల్లులు వన ప్రవేశం చేసేంత వరకు ఆయన పూజారులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేవారు.

జాతరలో సాంబశివరావు అధికారుల నుంచి మంచి పేరు సంపాదించాడు. ఆయన మృతితో మేడారంలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పూజారులు, గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మేడారంలో ఆయన దహన సంస్కారాలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతోపాటు మేడారం వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన మృతిపట్ల పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, జాతర పునరుద్దరణ కమిటీ చైర్మన్‌ శివయ్య, సమ్మక్క– సారలమ్మ పూజారులు, ఆదివాసీ సంఘాల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాలోని పలువురు అధికారులు సంతాపం తెలిపారు. మృతుడికి భార్య సంతోషిని, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. 
చదవండి: మహిళా ప్రతినిధులతో సంబంధం.. ఇతర మహిళలను ట్రాప్‌లో పడేసి


సాంబశివరావు భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే సీతక్క 

ఎమ్మెల్యే సీతక్క సంతాపం
సాంబశివరావు మృతిపై ఎమ్మెల్యే సీతక్క వ్యక్తం చేశారు. మేడారంలోని వారి స్వగృహం వద్ద మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. సాంబశివరావు కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆమెతో పాటు కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి, తదితరులు ఉన్నారు. 

సంతాపం తెలిపిన మంత్రి ఎర్రబెల్లి ..
సమ్మక్క పూజారి సాంబశివరావు మృతి చెందిన విషయం తెలుసుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top