మావో అగ్రనేత కత్తిమోహన్‌రావు మృతి

Maoist Leader Kathi Mohan Rao Deceased In Dandakaranya - Sakshi

10వ తేదీన గుండెపోటుతో మరణించినట్లు మావోయిస్టు పార్టీ ప్రకటన 

ముగిసిన 39 ఏళ్ల సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానం 

సాక్షి, హైదరాబాద్‌/మహబూబాబాద్‌: దండకారణ్యంలో మావోయిస్టులు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అగ్రనేతలు వరుసగా అనారోగ్యం బారిన పడుతున్నారు. మావోయిస్టు పార్టీ రెండవ తరం నాయకుల్లో కీలక నేతగా ఎదిగిన కత్తి మోహన్‌ రావు అలియాస్‌ ప్రకాష్‌ ఈనెల 10న గుండెపోటుతో మరణించినట్లు మావోయిస్టు పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్‌ ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈనెల 11న దండకారణ్యంలో లాంఛ నాలతో అంత్యక్రియలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. మోహన్‌ రావు మృతికి సంతాపం తెలిపారు. ఆయన దీర్ఘకాలంగా ఆస్తమా, బీపీ, షుగర్‌ వ్యాధులతో బాధపడుతు న్నాడు. గతవారం దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్‌ అలియాస్‌ మోహన్‌ అలియాస్‌ శోభ్‌రాయ్‌ కరోనా బారిన పడ్డా.. డయేరియాతో మరణించిన విషయం తెలిసిందే. మధుకర్‌ జూన్‌ 6న మరణించగా.. 10న మోహన్‌రావు మృతిచెందాడు. దీంతో ఐదు రోజుల వ్యవ ధిలో ఇద్దరు అగ్రనేతలను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. 
కాకతీయ నుంచి కత్తి ప్రస్థానం 
మోహన్‌ రావు మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం మండలం గార్ల గ్రామంలో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. మహబూబాబాద్‌లో ఇంటర్, ఖమ్మంలో డిగ్రీ, కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదివాడు. వర్సిటీ స్థాయిలో డబుల్‌ గోల్డ్‌మెడల్‌ సాధించాడు. ఈ ఘనత సాధించిన వారెవరికైనా ఆ రోజుల్లో సులువుగా ప్రభుత్వ కొలువుదక్కేది. కానీ, మోహన్‌రావు ఉద్యమాలవైపు ఆకర్షితుడయ్యాడు. తన చిన్ననాటి మిత్రుడు ఆమెడ నారాయణతో కలిసి 1982లో రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌లో చేరాడు. 39 ఏళ్లపాటు ఉద్యమ ప్రస్థానం సాగించాడు. కిన్నెర దళానికి డిప్యూటీ కమాండర్, మహదేవ్‌పూర్‌ దళ కమాండర్‌గా పనిచేశాడు.

తర్వాత ఏటూరునాగారం, పాండవ దళ స్కాడ్‌ ఏరియా సభ్యుడిగా, ఉత్తర తెలంగాణ ప్రెస్‌యూనిట్‌ నిర్వహణ కమిటీలో, ఖమ్మం జిల్లా కమిటీలో పనిచేసి 2008లో దండకారణ్యానికి బదిలీ అయ్యాడు. అక్కడ దామదాదగా పేరు మార్చుకొని జనతన సర్కార్‌ నడుపుతున్న స్కూల్లో గురూజీగా పనిచేశాడు. ఈ క్రమంలో 1985లో, 1992లో రెండుసార్లు పోలీసులకు పట్టుబడి ఆరేళ్లకుపైగా జైలు జీవితం అనుభవించాడు. మోహన్‌రావు నాలుగు దశాబ్దాల ఉద్యమ ప్రస్థానం ముగిసిందని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. 

కరోనా, దీర్ఘకాల రోగాల ముప్పు 
దండకారణ్యంలోనూ కరోనా విలయతాండవం చేస్తుండటంతో పలువురు నేతలు ఆ మహమ్మారి బారినపడ్డారని ఈనెల 2న వరంగల్‌ పోలీసులకు పట్టుబడిన గడ్డం మధుకర్‌ తెలిపాడు. 12 మంది కీలక నేతల ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని చెప్పాడు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ నుంచి ముందస్తుగా సేకరించిన మందులతో వీరు సొంత వైద్యానికే ప్రాధాన్యమిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మావోయిస్టులు ఆరోగ్యపరంగా మునుపెన్నడూ లేని సవాళ్లను ఎదుర్కొంటున్నారని ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు చెబుతున్నారు.
చదవండి: హైదరాబాద్‌: పలు ప్రాంతాల్లో భారీ వర్షం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top