తెలంగాణ: బాబోయే ఇదేం చలి..  రోజంతా చల్ల గాలులతో వణికిపోతున్న జనం

Mandous Effect Telangana Victim Cold Waves Temperatures Drop - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  చలి తీవ్రత రాష్ట్రంలో విపరీతంగా పెరిగింది. గత రెండుమూడు రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో పగటి పూట సైతం జనాలు వణికిపోతున్నారు. ఉదయం పది గంటలకైనా చలి ప్రభావం తగ్గకపోతుండడం.. సాయంత్రం ఆరు, ఏడు గంటల నుంచే జనాలు ఇంటికే పరిమితమైపోతున్నారు చలి దెబ్బకు. 

చలి కాలానికి మాండూస్‌ తుపాన్‌ ప్రభావం తోడవ్వడంతో తీవ్రత మరింతగా ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.  వేకువ ఝామున పొగమంచుతో వాహనదారులు .. సాయంత్రం సమయంలో పనుల నుంచి ఇళ్లకు తిరిగి వచ్చేవాళ్లు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే.. పది డిగ్రీల సెల్సియస్‌ లోపుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు అక్కడక్కడా నమోదు అవుతుండడం గమనార్హం. దీంతో స్వెటర్లు, చలిమంటలకు ఆశ్రయించక తప్పడం లేదు.

చలి తీవ్రత అంతకంతకు పెరుగుతుండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆహారపు అలవాట్ల విషయంలోనూ జాగ్రత్తలు పాటించాలంటున్నారు. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవారు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, గర్భిణులు, బాలింతలు, చిన్ప పిల్లలు, వృద్ధులు మరింత జాగ్రత్తలు పాటించాలని కోరుతున్నారు. రాత్రిపూట, తెల్లవారుజామున బయటకు వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌తో పాటు పలు చోట్ల తుపాను ప్రభావంతో చిరు జల్లులు కురుస్తున్నాయి. అయితే చాలా చోట్ల ఈ ప్రభావం చలి తీవ్రత రూపంలోనే కనిపిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top