నాగోల్‌: నిర్లక్ష్యానికి యువకుడు బలి.. ఈ పాపం ఎవరిది?

Man Died Due To Negligence Of Authorities At Nagole Metro Station - Sakshi

సాక్షి, ఉప్పల్‌: అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. ఈ పాపం తమది కాదంటే.. తమది కాదంటూ రెండు శాఖల అధికారులు ఎవరికి వారు నెట్టేసుకుంటున్నారు. శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, జవాబుదారి తనం కొరవడటంతో నాగోల్‌ మెట్రో స్టేషన్‌ వద్ద దిగిన ప్రయాణికుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు విడిచాడు. ఎస్‌ఐ అంజయ్య తెలిపిన ప్రకారం.. నాగోల్‌ మోహన్‌నగర్‌ ప్రాంతానికి చెందిన దస్తీ నవనీత్‌(35) కూకట్‌పల్లిలోని మెడ్‌ప్లస్‌లో స్టోర్‌ సూపర్‌వైజర్‌. నిత్యం నాగోల్‌ మెట్రోస్టేషన్‌ పార్కింగ్‌లో తన వాహనాన్ని పార్కు చేసి కూకట్‌పల్లికి వెళ్తాడు. తిరుగు ప్రయాణంలో నాగోల్‌ మెట్రో స్టేషన్‌లో దిగి పార్కు చేసిన వాహనాన్ని తీసుకెళ్తుంటాడు.

ఇదే క్రమంలో మంగళవారం రాత్రి చివరి ట్రైన్‌లో నాగోల్‌ స్టేషన్‌లో దిగాడు. పార్కు చేసిన వాహనాన్ని తీసుకునేందుకు ఫుట్‌పాత్‌ వద్ద ఉన్న గ్రిల్‌ పైనుంచి దాటేందుకు ప్రయత్నం చేయగా పక్కనే ఉన్న జీహెచ్‌ఎంసీ వీధి లైట్ల స్తంభానికి గ్రిల్‌కు విద్యుత్‌ ప్రసారం ఉండటంతో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మున్సిపల్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లనే భూమిలో నుంచి వేసిన విద్యుత్‌ వైర్లు తేలడం. వర్షం కురవడంతో విద్యుత్‌ ప్రసారం అయినట్లు పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. సోదరుడు కిషోర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
చదవండి: ఆడి కారు యాక్సిడెంట్‌: ఎన్నో అనుమానాలు.. అసలు ఏం జరిగింది?  
చెప్పిన కూర వండలేదనే కోపంతో భార్యని..

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top