కేటీఆర్‌ సీఎం కానున్నారు.. ప్రకటనల కోసం డబ్బులివ్వండి

Man Arrested For Extorting Money By Claiming As KTR's PA - Sakshi

కేటీఆర్‌ పీఏనంటూ డబ్బుల వసూళ్లకు యత్నం.. పోలీసుల అదుపులో నిందితుడు

ప్రకటనల పేరుతో రూ.50 లక్షలు డిమాండ్‌  

సాక్షి, బంజారాహిల్స్‌: మంత్రి కేటీఆర్‌ పీఏనని ప్రచారం చేసుకుంటూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం ఎవ్వారిపేట గ్రామానికి చెందిన బుడుమూరు నాగరాజు (25) మాజీ రంజీ క్రికెట్‌ ప్లేయర్‌. గత కొంతకాలంగా జల్సాలకు అలవాటుపడ్డ నాగరాజు తేలికగా డబ్బులు సంపాదించే వ్యవహారాలపై దృష్టి సారించాడు. తాను కేటీఆర్‌ పీఏనని పరిచయం చేసుకుని, ఈ నెల 15వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు బంజారాహిల్స్‌లోని రెయిన్‌బో పిల్లల ఆస్పత్రి ల్యాండ్‌లైన్‌కు ఫోన్‌ చేశాడు. ఎండీ డాక్టర్‌ కంచర్ల రమేశ్‌ ఫోన్‌ నంబర్‌ అడిగి తీసుకున్నాడు. తరువాత డాక్టర్‌ రమేశ్‌కు ఫోన్‌ చేసి తాను కేటీఆర్‌ పీఏ తిరుపతిరెడ్డిని మాట్లాడుతున్నానని, ఎల్బీ స్టేడియంలో ఈ నెల 25న కేటీఆర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని చెప్పారు.

మీడియాలో ప్రకటనలిచ్చేందుకుగాను 50 లక్షలు సమకూర్చాలని తెలిపారు. అయితే అనుమానం వచ్చిన డాక్టర్‌ రమేశ్‌ ఆరా తీయగా ఆ నంబర్‌ తిరుపతిరెడ్డిది కాదని తేలింది. వెంటనే ఆస్పత్రి సీనియర్‌ మేనేజర్‌ బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితుడు నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. నిందితుడు గతంలో కూడా ప్రముఖులకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్‌ చేసినట్లుగా తేలింది. జూబ్లీహిల్స్, ఓయూ, సైబర్‌ క్రైం పోలీసులు గతంలోనూ అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top