TSRTC: ఆర్టీసీ.. చతికిల!

Lockdown Effect: Nalgonda Region RTC Gets Less Income - Sakshi

లాక్‌డౌన్‌ ఎఫ్టెక్ట్‌.. ఆదాయం అంతంతే

ఉదయం పది గంటల వరకే సర్వీసులు

నల్లగొండ రీజియన్‌ పరిధిలో ప్రధాన రూట్లలో నడిపిస్తున్న అధికారులు

నామమాత్రంగా ప్రయాణికుల రద్దీ..

సొంత వాహనాలవైపు మొగ్గు

నష్టాల్లో ఉన్నా ప్రయాణికుల కోసమే నడిపిస్తున్నాం : ఆర్‌ఎం

మిర్యాలగూడ టౌన్‌: కార్మికుల సమ్మె, మొదటి విడత కరోనా లాక్‌డౌన్‌.. సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్‌తో నల్లగొండ జిల్లా ఆర్టీసీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. ఆదాయం లేక కోలుకోలేకపోతోంది. ప్రస్తుతం ఆ.. నాలుగు గంటల మినహాయింపు సమయంలో అరకొర బస్సులు నడుపుతున్నా ప్రయాణికులనుంచి పెద్దగా స్పందన ఉండడం లేదు. దీంతో ఆదాయం అంతంతే సమకూరుతోంది.

ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ 2019 అక్టోబర్‌లో సమ్మెలోకి దిగిన విషయం తెలిసిందే. మొత్తం 55 రోజులపాటు సమ్మె చేశారు. దీంతో కొంతవరకు ఆర్టీసీ సంస్థ నష్టాల్లోకి వెళ్లింది. ఆ సమ్మెనుంచి తేరుకోకముందే కరోనా వైరస్‌ విజృంభించడంతో కేంద్రం జనత కర్ఫ్యూ విధించడంతో ఆర్టీసీ బస్సులు 59రోజులపాటు డిపోకే పరి మితమయ్యాయి. సంస్థకు ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదు. కార్గో సర్వీసులను ప్రారంభించి మెయింటనెన్స్‌ వరకు ఖర్చులు వచ్చాయి.

ప్రధాన రూట్లలో సర్వీసులు
రెండో దశ విజృంభణలో భాగంగా లాక్‌డౌన్‌ మినహాయించిన ఆ నాలుగు గంటలు ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల ఆదరణ పూర్తిగా కరువైంది. లాక్‌డౌన్‌ వి«ధించడంతో సర్వీసులన్నీ తగ్గించారు. కొన్ని బస్సులు మాత్రమే ప్రధాన రూట్లల్లో నడిపిస్తున్నారు. కరోనా ఉధృతికి పలు డిపోలలో బస్సులకు శానిటైజేషన్‌ చేయించి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తగు జాగ్రత్తలను తీసుకుంటున్నారు. ప్రతి డిపోలలో ఉద్యోగులకు ఉదయాన్నే టెంపరేచర్‌ చెక్‌ చేసి విధులకు పంపిస్తున్నారు. ప్రతి ఉద్యోగి మాస్క్‌లను ధరిస్తూ ఎప్పటికప్పుడు శానిటైజర్‌ను వాడుతున్నారు.

ఉదయం 6 నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రయాణీకుల సౌకర్యార్ధం బస్సులను నడిపిస్తున్నప్పటికి ఎవరు కూడా బస్సులను ఎక్కకపోవడంతో బస్టాండ్‌లన్నీ వెలవెలబోతున్నాయి. నల్లగొండ ఆర్టీసీ రీజియన్‌ పరిధిలో ఏడు డిపోలు యాదగిరిగుట్ట, నార్కట్‌పల్లి, సూర్యాపేట, కోదాడ, నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ ఉన్నాయి. ఆయా డిపోల పరిధిలో సాధారణ సమయంలో పెద్ద సంఖ్యల్లో ప్రయాణికులు ఉంటారు. లాక్‌డౌన్‌ సమయంలో కనీసం 10 మంది కూడా బస్సు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. కోవిడ్‌ జాగ్రత్తల్లో భాగంగా ప్రయాణికులు సొంత వాహనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరికొందరు ప్రయాణాలను మానుకొని ఇంటికే పరిమితమవుతున్నారు. దీంతో జిల్లా ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పడిపోయి సంస్థ నష్టాల్లోకి వెళ్తోంది.

రీజియన్‌ పరిధిలో 57శాతం ఓఆర్‌
నల్లగొండ రీజియన్‌ పరిధిలోని ఏడు డిపోల పరిధిలో మొత్తం 735 బస్సులున్నాయి. ఆర్టీసీ బస్సులు 448 ఉండగా, అద్దె బస్సులు 286 ఉన్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా అద్దె బస్సులన్నీ బస్టాండ్‌లకే పరిమితం అయ్యాయి. 448 ఆర్టీసీ బస్సులకు రోజు 130 నుంచి 153 బస్సుల వరకు ప్రయాణికుల రద్దీని నడిపిస్తున్నారు. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు ఈనెల 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏడు డిపోలలో రూ.57,30,309 ఆదాయం సమకూరింది. 57 ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్‌) వచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ప్రయాణికుల సౌకర్యార్థ్యం సర్వీసులు
ప్రయాణికుల సౌకర్యార్థ్యం కోసం లాక్‌డౌన్‌ మినహాయింపు సమయమైన ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే బస్సులను నడిపిస్తున్నాం. ప్రధాన రూట్లలో సర్వీసులు నడుస్తున్నాయి. కరోనా నిబంధనలను పాటిస్తూ బస్సులను శానిటైజేషన్‌ చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగుకుండా తగు చర్యలు తీసుకుంటున్నాం. ప్రయాణికులు ఆర్టీసీ బస్సులను ఆదరించి అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరుకుంటున్నాం.  
- రాజేంద్రప్రసాద్, ఆర్టీసీ ఆర్‌ఎం, నల్లగొండ

చదవండి: 
జనం చస్తుంటే.. జాతర చేస్తారా..

చేయి విరిగిందని వెళ్తే రూ.25 లక్షల బిల్లు

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top