ఆదాయం లాక్‌‘డౌన్‌’: రాబడి తగ్గి.. అప్పులు పెరిగి

Less Revenue To Telangana Treasury In May Month - Sakshi

ప్రభుత్వ ఖజానాపై కరోనా దెబ్బ

మే నెలలో దాదాపు రూ.2 వేల కోట్లు తగ్గిన ఆదాయం

అప్పులు అనివార్యం కావడంతో రూ.6,600 కోట్ల రుణ సేకరణ

జూన్‌లోనూ రాబడి రూ.1,500 కోట్లు తగ్గుతుందని అంచనా

సాక్షి, హైదరాబాద్‌: ఖజానాపై కరోనా దెబ్బ పడింది. ఆర్థిక సంవత్సరం మొదట్లోనే ఆదాయానికి గండికొట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొదటి మాసమైన ఏప్రిల్‌లో ఆశించినంత ఆదాయం వచ్చినా, లాక్‌డౌన్‌ ప్రభావానికి గురైన మే నెలలో మాత్రం రాబడులు గణనీయంగా తగ్గిపోయాయి. జీఎస్టీ, రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్‌ ఆదాయాలు తగ్గిపోగా, అమ్మకపు పన్ను రాబడి మాత్రమే ఏప్రిల్‌ నెలతో పోలిస్తే కొంచెం అటూ ఇటూగా వచ్చింది. అప్పులు అనివార్యం కావడంతో ఒక్క మే నెలలోనే రూ.6,600 కోట్లకు పైగా నిధులను రుణాల రూపంలో సమకూర్చుకోవాల్సి వచ్చింది. ఇక జూన్‌ నెలలో కూడా 20 రోజుల పాటు లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున, ఆ నెలలో కూడా ప్రభుత్వ రాబడులపై ప్రభావం ఉంటుందని, మే నెలలో రూ.2 వేల కోట్ల వరకు తగ్గిన ఆదాయం.. జూన్‌లో రూ.1,500 కోట్ల వరకు తగ్గవచ్చని ఆర్థిక శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తం మీద 2021-22 తొలి త్రైమాసికం నిరాశాజనకంగానే ముగియనుందని ఆ శాఖ అధికారులు అంటున్నారు.

కేంద్రం నుంచి ఊరట
కరోనా తీవ్రత నేపథ్యంలో లాక్‌డౌన్‌ మే మాసమంతా అమల్లో ఉంది. ఉదయం 10 గంటల వరకు మాత్రమే ప్రభుత్వం సడలింపు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని ఆదాయ శాఖలు పని చేయలేదు. ముఖ్యంగా రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం తగ్గడంతో పాటు జన సంచారం లేని కారణంగా వాణిజ్య కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో పన్ను రాబడి తగ్గిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద రూ.3,019 కోట్లు వస్తే, మే నెలలో అది రూ.1,737 కోట్లకు తగ్గిపోయింది. అంటే దాదాపు రూ.1,300 కోట్లు తగ్గుదల కనిపించింది. ఇక, మద్యం షాపులు కూడా ఉదయం 10 గంటల వరకే ఉండడంతో ఏప్రిల్‌తో పోలిస్తే రూ.250 కోట్ల వరకు తక్కువ విక్రయాలు జరిగాయి. రిజిస్ట్రేషన్ల ఆదాయం అయితే ఏకంగా రూ.500 కోట్లు తగ్గిపోయింది. కానీ పెట్రోల్, డీజిల్, గ్యాస్, జీఎస్టీ పరిధిలోనికి రాని ఇతర వస్తువుల విక్రయాలపై వచ్చే అమ్మకపు పన్ను మాత్రం ఏప్రిల్, మే నెలల్లో దాదాపు సమానంగా వచ్చింది. దీంతో పాటు కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.500 కోట్లు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద రూ.500 కోట్ల రాబడి వచ్చింది. అయినప్పటికీ అప్పులు అనివార్యమై మే నెలలో రూ.6,600 కోట్లను రుణాల రూపంలో సమకూర్చుకోవడంతో, ఈ ఏడాది రెండు నెలల్లోనే అప్పుల చిట్టా రూ.8 వేల కోట్లు దాటింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top