మూడున్నర దశాబ్దాలైనా.. పూర్తికాని ‘లెండి ప్రాజెక్టు’

Lendi Project Still Remains Incomplete After Thirty Years In Nizamabad - Sakshi

సాక్షి, కామారెడ్డి : అంతర్రాష్ట్ర ప్రాజెక్టు అయిన ‘లెండి’కి ని ధుల గ్రహణం వీడడం లేదు. మూడున్నర దశాబ్దాలు గడచినా పనులు పూర్తికావడంలేదు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మూడున్నర దశాబ్దాల క్రితం పునాదిరాయి పడింది. ఈ ప్రాజెక్టు కింద ఇరు రాష్ట్రాల్లో కలిపి 60వేల పైచిలుకు ఎకరాల భూములకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించారు. కానీ నిర్మాణ పనులకు, భూసేకరణ, నిధుల సమస్యలతో ప్రాజెక్టు పనులు కొనసాగడం లేదు.

ప్రాజెక్టు పనులు పూర్తయితే వెనుకబడిన ప్రాంతమైన కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లో దాదాపు 22వేల ఎకరాల మెట్ట భూములు సాగులోకి వస్తాయి. కేవలం వర్షాధారంపైనే ఆధారపడి ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతులు లెండి ప్రాజెక్టు కోసం ఏళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రాజెక్టు ముంపు రైతులకు పునరావాసం కింద అందించాల్సిన డబ్బులు అప్పట్లో పూర్తి స్థాయిలో చెల్లించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం పెండింగులో పడిపోయింది. దీంతో ప్రాజెక్టు కోసం ఎదురుచూస్తున్న రైతుల ఆశలు అడియాశలయ్యాయి.

ప్రాజెక్టు పూర్తి కాకున్నా కెనాల్‌ పనులు చేపట్టిన దృశ్యం  
లెండి సామర్థ్యం 6.36 టీఎంసీలు..  
మహారాష్ట్రలోని దెగ్లూర్‌ తాలూకా గోజేగావ్‌ గ్రామం వద్ద లెండి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 6.36 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు రూపకల్పన జరిగింది. ఇందులో మహారాష్ట్రకు 3.93 టీఎంసీలు, తెలంగాణ రాష్ట్రానికి 2.43 టీఎంసీల నీటిని వాడుకునేలా నిర్ణయించారు.  

ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.54.55కోట్లు.. 
ప్రాజెక్టు నిర్మాణం మొదలుపెట్టిన 1984 సంవత్సరంలో ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.54.55 కోట్లు అవుతుందని అంచనా వేశారు.  అప్పట్లో నిధుల సమస్య, భూసేకరణ వంటి సమస్యలతో పనులకు అంతరాయం ఏర్పడింది. ఫలితంగా పనులు ఆగిపోవడంతో ఇప్పుడు అంచనా వ్యయం రూ.వెయ్యి కోట్లు దాటింది. అప్పట్లో ముంపు గ్రామాల రైతులకు పరిహారం విషయంలో అసంపూర్తి చెల్లింపులు జరగడంతో నిర్మాణానికి ఆటంకాలు ఎదురయ్యాయి.  ఈ ప్రాజెక్టు ద్వారా మహారాష్ట్రలోని దెగ్లూర్, ముఖేడ్‌ తాలూకాల పరిధిలోని గ్రామాల్లో 39,275 ఎకరాల ఆయకట్టుకు, తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలోని మద్నూర్, బిచ్కుంద మండలాల్లోని గ్రామాల పరిధిలో 22 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రతిపాదించారు.

75శాతం పనులు పూర్తి.... 
గోజేగావ్‌ వద్ద చేపట్టిన లెండి ప్రాజెక్టు నిర్మాణ పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టుకు 14 గేట్లు నిర్మించాల్సి ఉండగా, 10 గేట్ల నిర్మాణం అప్పుడే పూర్తయ్యింది. మరో నాలుగు గేట్ల నిర్మాణాలు పూర్తి కావలసి ఉంది. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత లెండి ప్రాజెక్టు పనులను కొలిక్కి తెచ్చే ప్రయత్నం జరిగింది. ప్రాజెక్టు కోసం రూ . 43.14 కోట్లు ఖర్చు చేశారు.  అప్పుడు కామారెడ్డి జిల్లా పరిధిలోని మద్నూర్, బిచ్కుంద మండలాలకు సంబంధించి కెనాల్స్‌ పనులు జరిగాయి. కాని ప్రాజెక్టు పనులు మాత్రం అసంపూర్తిగానే ఉండిపోయాయి. కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత లెండి ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.554.54 కోట్లని తేల్చారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 42 శాతం కింద రూ.236.10 కోట్లు, మిగతా మొత్తం రూ.318.45 కోట్లు మహారాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. రాష్ట్ర వాటాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.189.73 కోట్లు విడుదల చేసింది. అయినా పనులు మాత్రం ముందుకు సాగలేదు. దీంతో ప్రాజెక్టు అంచనా వ్యయం ఏటేటా పెరుగుతూనే ఉంది.  

పరిహారమే అసలు సమస్య... 
మహారాష్ట్రలో ముంపునకు గురవుతున్న గ్రామాల ప్రజలకు పరిహారం విషయంలో అక్కడి ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడం వల్లే సమస్య పరిష్కారం కావడంలేదని అంటున్నారు. ఏటేటా అంచనా వ్యయం పెరుగుతూనే ఉంది. ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం రూ.వెయ్యి కోట్లకు చేరుకుంటుందని భావిస్తున్నారు. అక్కడి ప్రభుత్వం చేస్తున్న జాప్యం వల్లే లెండి పనులు పూర్తి కాలేదని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడేళ్ల క్రితం అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్రఫడ్నవీస్‌తో ప్రాజెక్టులపై జరిగిన చర్చల సందర్భంగా సీఎం కేసీఆర్‌ లెండి ప్రాజెక్టు సమస్యపై కూడా చర్చించారు. అయినప్పటికీ సమస్య కొలిక్కిరావడం లేదు. రైతుల ఆశలు నెరవేరడం లేదు.  

జల వనరుల శాఖతోనైనా న్యాయం జరిగేనా.... 
రాష్ట్ర ప్రభుత్వం నీటి పారుదల శాఖలోని ఆయా విభాగాలన్నింటినీ కలిపి జలవనరుల శాఖను ఏర్పాటు చేసింది. కామారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, ఎత్తిపోతల పథకాలు, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 22వ ప్యాకేజీతో సహా అన్నింటినీ కామారెడ్డిలో ఏర్పాటు చేయబోయే చీఫ్‌ ఇంజనీర్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. పరిపాలనా సౌలభ్యం కలుగనున్నందున లెండి ప్రాజెక్టు సమస్యపై పర్యవేక్షణ, పరిశీలనకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం లెండి ప్రాజెక్టుపై దృష్టి సారించాలని మద్నూర్, బిచ్కుంద ప్రాంత రైతాంగం వేడుకుంటోంది.  

ఏండ్ల సంది ఎదురు చూస్తున్నం... 
మాకు ఎలాంటి నీటి సౌకర్యం లేదు. లెండి ప్రాజెక్టు కడితే నీళ్లు వస్తయని ఏండ్ల సంది ఎదురు చూస్తున్నం. అప్పట్లో కాలువలు తవ్వి, లైనింగ్‌ జేసిండ్రు. నీళ్లు వచ్చినట్టేనని సంబరపడ్డం. ఏండ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాలేదు. నీళ్ల సౌకర్యం లేక వానల మీద ఆధారపడి ఆరుతడి పంటలు వేస్తున్నం. కాలువలు వస్తే మా కష్టాలు తీరుతయి. –రాములు, రైతు, మద్నూర్‌

లెండి నీళ్లు వస్తయని చెపుతూనే ఉన్నరు... 
లెండి నీళ్లు వస్తయని, నీళ్లొస్తే మా భూములకు నీటి కష్టం తీరుతదని ఎదురు చూస్తున్నం. మస్తు సంవత్సరాల నుంచి లెండి ముచ్చట చెప్పుతనే ఉన్నరు. ఎప్పుడు కట్టుడు అయిపోతుందో, నీళ్లు ఎప్పుడు వస్తయో తెలుస్తలేదు. వానలు పడితేనే మాకు పంటలు, లేకుంటే ఇబ్బందులు తప్పడం లేదు. సర్కారు ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఆదుకోవాలె. –నాగనాథ్, రైతు, మద్నూర్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top