సాయమింతేనా ‘సఖి’! | Lack of Supervision at Sakhi Centers Established for Womens Safety | Sakshi
Sakshi News home page

సాయమింతేనా ‘సఖి’!

Mar 23 2026 1:10 AM | Updated on Mar 23 2026 1:10 AM

Lack of Supervision at Sakhi Centers Established for Womens Safety

మహిళల రక్షణ కోసం ఏర్పాటైన సఖి కేంద్రాల్లో కొరవడిన పర్యవేక్షణ 

బాధితులకు పూర్తిస్థాయిలో అందని న్యాయ సహాయం

చాలా కేంద్రాల్లో కేస్‌ వర్కర్, కౌన్సిలర్, లీగల్‌ అడ్వైజర్లు లేని పరిస్థితి 

ఖాళీల భర్తీకి చర్యలు వేగవంతం చేయని మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ

సాక్షి, హైదరాబాద్‌: మహిళల రక్షణే ప్రధాన లక్ష్యంగా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వన్‌ స్టాప్‌ సెంటర్‌ (ఓఎస్‌సీ–సఖి)ల పర్యవేక్షణ గాడి      తప్పింది. ఈ కేంద్రాల్లో నమోదయ్యే కేసుల సంఖ్యను క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖకు సమర్పిస్తున్నప్పటికీ వాటి విశ్లేషణ, సేవల విస్తరణపై అధికారులు దృష్టి పెట్టడంలేదు. కేసుల పరిష్కార చర్యల్లో భాగంగా సఖి కేంద్రాల్లో కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. అయితే అందుకు తగిన న్యాయసహాయంతోపాటు వారి సమస్యలను ఆలకించే పరిస్థితి లేదు. 

రాష్ట్రవ్యాప్తంగా సఖి కేంద్రాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ప్రతి కేంద్రంలో 13 మంది సిబ్బంది ఉండాల్సి ఉండగా చాలాచోట్ల కేస్‌ వర్కర్, కౌన్సిలర్, లీగల్‌ అడ్వైజర్లు లేరు. దీంతో బాధితులకు న్యాయ సహాయం అందడం కష్టంగా మారింది. సఖి కేంద్రాల్లో ఖాళీల వివరాలను కేంద్రాలవారీగా సేకరించినప్పటికీ వాటి భర్తీకి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ చర్యలు వేగవంతం చేయడంలేదు. దీనిపై మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్‌లోని జాయింట్‌ డైరెక్టర్‌ను సంప్రదించగా ఆమె స్పందించలేదు. 

నాలుగు రెట్లు పెరిగిన లైంగిక వేధింపులు..  
రాష్ట్రంలో చిన్నారులపై లైంగిక దాడులు మొదలు మహిళలపై లైంగిక వేధింపులు, గృహహింస పెరుగుతున్నాయి. రెండేళ్లుగా సఖి కేంద్రాల్లో నమోదైన కేసులను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుంది. సఖి కేంద్రాలను ఆశ్రయిస్తున్న బాధితుల్లో ఎక్కువ మంది లైంగిక వేధింపులకు గురైన వారే ఉంటున్నారు. 2024–25లో లైంగిక దాడులు, వేధింపులకు గురైనవారు 55 మంది సఖి కేంద్రాలకు వస్తే 2025–26లో జనవరి నాటికే 243 మంది ఆశ్రయించారు. 

మరోవైపు ఇదే కాలానికి అత్యాచార బాధితుల సంఖ్య 64 నుంచి 74కు (15.6 శాతం) పెరిగింది. అలాగే చిన్నారులపై లైంగిక దాడుల కేసులు 2024–25లో మొత్తం 553 కేసులు నమోదవగా 2025–26 జనవరి నాటికి వాటి సంఖ్య 613కు పెరిగింది. మునుపటి ఏడాదితో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు 10.8 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో బాల్య వివాహ కేసులు 348 నమోదవగా ఈసారి ఆ సంఖ్య 382కు పెరిగింది. 

ఈ కేసుల నమోదు గతేడాదితో పోలిస్తే 9.8 శాతం పెరిగినట్లు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వరకట్న వేధింపులు, తద్వారా జరిగిన మరణాలు కూడా భారీగా పెరిగాయి. ఈ విభాగంలో 2024–25లో 473 కేసులు నమోదైతే 2025–26 జనవరి నాటికి ఈ కేసుల సంఖ్య 594కు పెరిగింది. మునుపటి ఏడాదితో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు 25.6 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది.

గృహహింస కేటగిరీలో కేసుల సంఖ్య ఒకే విధంగా ఉంది. గతేడాది 6,907 కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నాటికి 6,173 కేసులు నమోదయ్యాయి. అయితే మహిళల అక్రమ రవాణా కేసులు కాస్త తగ్గగా మిస్సింగ్, కిడ్నాప్‌ కేసులు గతంలో నమోదైన తరహాలోనే ఉన్నాయి. సైబర్‌ క్రైం, చీటింగ్, ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన కేసులు కూడా పెద్దగా పెరగలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement