దేవుడితోనైనా కొట్లాడుతాం

KTR Says There is no compromise on water supply to Palamuru - Sakshi

పాలమూరుకు నీటినందించే విషయంలో రాజీలేదు: కేటీఆర్‌ 

నేత కార్మికులకు త్వరలో రూ.5 లక్షల బీమా వర్తింపజేస్తాం 

కరోనా ఆర్థికంగా దెబ్బతీసినా ప్రజా సంక్షేమంలో వెనుకడుగు వేయలేదు 

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌తోనే కాదు.. అవసరమైతే దేవుడితోనైనా పోరాడుతామని, పాలమూరుకు నీటినందించే విషయంలో ఎలాంటి రాజీలేదని రాష్ట్ర పురపాలక, ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో శనివారం ఆయన పర్యటించి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించి తీరుతామన్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నారాయణపేట జిల్లాకు నీరందించే కెనాల్‌ కోసం వచ్చే నెల 10న ప్రజాభిప్రాయ సేకరణ జరగనున్నట్లు తెలిపారు. దీనిపై ఈ ప్రాంతానికి చెందిన వారే అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని పేర్కొన్నారు. జిల్లాలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులందరూ రైతులను అధిక సంఖ్యలో తీసుకొచ్చి కరివెన నుంచి నారాయణపేట వరకు చేపట్టే కెనాల్‌కు అవసరమైన భూసేకరణకు మద్దతు తెలపాలని కోరారు.  

నేతన్నలను అన్ని విధాలా ఆదుకుంటాం.. 
రూ.5 లక్షల బీమా వర్తింపజేసే పథకాన్ని రాష్ట్రంలోని నేత కార్మికులకు త్వరలో వర్తించేలా చూస్తామని కేటీఆర్‌ అన్నారు. 70 ఏళ్లలో ఎవరూ ఆలోచించని విధంగా ముఖ్యమంత్రి పల్లెలు, పట్టణాలను ప్రగతి బాటలో నడిపిస్తున్నారన్నారు. ప్రపంచాన్ని కరోనా వైరస్‌ అతలాకుతలం చేసి ఆర్థిక వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసిందని చెప్పారు. అయినా ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో వెనుకడుగు వేయకుండా కేసీఆర్‌ నేతృత్వంలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో వరిని పండించామని.. రైతులకు ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, వాణిదేవి, ప్రభుత్వ విప్‌లు కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.  

ఏబీవీపీ కార్యకర్తలపై లాఠీచార్జ్‌
సభ ప్రారంభానికి ముందు మంత్రి కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసి.. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు, విద్యార్థులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగి ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేయడంతోపాటు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తర్వాత సభలో మంత్రి కేటీఆర్‌ ప్రసంగిస్తుండగా పీడీఎస్‌ విద్యార్థులు నిరసన తెలిపారు. పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వీరిని కూడా అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top