నల్లధనం తెస్తానన్న మోదీ.. తెల్లముఖం వేశారు: కేటీఆర్‌ కౌంటర్‌

KTR Satirical Comments On Narendra Modi And Rahul Gandhi - Sakshi

ప్రధాని మోదీపై మంత్రి కేటీఆర్‌ విసుర్లు 

అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం 

కాంగ్రెస్‌ కాలం చెల్లిన మందులాంటిది 

కొల్లాపూర్, బిజినేపల్లి సభల్లో మాట్లాడిన మంత్రి

సాక్షి, నాగర్‌కర్నూల్‌: ‘బీజేపీ మతపిచ్చి పార్టీ. దేశాన్ని రావణకాష్టంగా మార్చింది. ఆ పార్టీకి దేశంలో వాస్తవిక పరిస్థితులపై అవగాహన, ఆలోచన లేదు. హిందూ, ముస్లిం అంటూ పక్కవాడిని కూడా పగవాడిలా చూపే ప్రయత్నం చేస్తోంది. రూ.15 లక్షల చొప్పున జన్‌ధన్‌ ఖాతాల్లో జమచేస్తామని ప్రధాని మోదీ అప్పుడు చెప్పిండు. విదేశాల్లో ఉన్న నల్లధనం తెమ్మంటే తెల్లమొఖం వేసుకుని తప్పించుకు తిరుగుతుండు.

యూపీఏ హయాంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.400 ఉంటేనే అది అసమర్థ ప్రభుత్వం అని మోదీ అన్నడు. ఇప్పుడు రూ.1,050 అయింది. ఎవరిది అసమర్థ ప్రభుత్వం, ఎవరు దద్దమ్మనో చెప్పాలి. కుల పిచ్చోడు, మత పిచ్చోడు వద్దు. మనకు ఎండిన గొంతులను తడిపే ప్రభుత్వం కావాలి’అని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు.

శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంతోపాటు కొల్లాపూర్‌ మున్సిపాలిటీ, నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తో కలసి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం కొల్లాపూర్, బిజినేపల్లిలో నిర్వహించిన బహిరంగసభల్లో ప్రసంగించారు. అభివృద్ధే కులంగా, సంక్షేమమే మతంగా, జనహితమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 29 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఉండగా ప్రస్తుతం 40 లక్షల మందికి అందజేస్తున్నామని చెప్పారు. వచ్చే ఆగస్టులో అర్హులందరికీ కొత్తగా పెన్షన్లు ఇస్తామన్నారు. రేషన్‌కార్డులు లేనివారికి సైతం పెన్షన్లు అందజేస్తామని చెప్పారు. దేశంలో 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా మరెక్కడా లేదన్నారు.  

కాంగ్రెస్‌కు భవిష్యత్‌ లేదు..
‘కాంగ్రెస్‌ కాలం చెల్లిన మందులాంటిది. ఆ పార్టీకి చరిత్రే మిగిలింది.. భవిష్యత్‌ లేదు. ఎన్నికలు ఎక్కడ జరిగినా కాంగ్రెస్‌కు డిపాజిట్‌ రాదు. రాహుల్‌గాంధీని మూడు రోజులుగా ఈడీ విచారణ చేస్తున్నా అడిగేవాడు లేడు. చావడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని ఎలా ఉద్ధరిస్తుంది?’ కేటీఆర్‌  ప్రశ్నించారు.  . 

ఇది కూడా చదవండి: పీజేఆర్‌ కూతురిగా టీఆర్‌ఎస్‌లో ఉండలేకపోతున్నా

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top