హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి
సీఎంకు లేఖ రాసిన బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం
సీఎంకు లేఖ పంపాలని స్పీకర్‌కు ఇచ్చిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండేళ్ల మూడు నెలల పాలనలో 19 ప్రధాన కుంభకోణాలు జరిగాయని, వీటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో లేదా హౌజ్ కమిటీ వేసి విచారణ జరపాలని బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పీకర్‌కు అందజేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీ అక్రమ మైనింగ్‌పై హౌజ్ కమిటీ వేయాలని బీఆర్‌ఎస్ సభ్యులు సభలో నినాదాలు చేస్తున్న సమయంలోనే ఈ లేఖను అందజేశారు.
తాము ఇచ్చిన లేఖను సీఎం రేవంత్‌రెడ్డికి పంపాలని కోరారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లలో రాష్ట్రం అవినీతి, కుంభకోణాలకు కేంద్రంగా మారిపోయింది. దాదాపు అన్ని శాఖల్లో అవినీతి, అక్రమాలు, అధికార దురి్వనియోగం యథేచ్ఛగా సాగుతోంది. వాటిని అడ్డుకోవాల్సిన వారే ఈ దోపిడీకి మూలస్తంభాలుగా మారిన పరిస్థితి మరింత ఆందోళన కలిగిస్తోంది.
బాధ్యత వహించాల్సిన మంత్రులకు ఈ కుంభకోణాల్లో నేరుగా ప్రమేయం ఉందనే ఆరోపణలు రావడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానం. ఈ కుంభకోణాల ఫలితంగా రూ.వేల కోట్ల ప్రజా ధనం కొద్దిమంది చేతుల్లోకి మళ్లిపోతోంది. నియంత్రణ లేకుండా సాగుతున్న ఈ దోపిడీని చూస్తే ఇది నిర్లక్ష్యమా లేక మీ ప్రోత్సాహమా అన్న అనుమానం ప్రజల్లో బలపడుతోంది’అని లేఖలో బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం పేర్కొంది.
అడ్డుకోవడం సీఎంగా మీ బాధ్యత
‘అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జ రుపుతామని శాసనసభలో స్వయంగా మీరే ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ పాలనలో జరిగిన కుంభకోణాల వివరాలు అందిస్తున్నాం. ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచా రణ జరిపి బాధ్యులపై కఠినచర్యలు తీసుకుని, ప్రజా ధనాన్ని రికవరీ చేయాలి.
పౌర సరఫరాలు, అమృత్ టెండర్లు, కేఎల్‌ఎస్‌ఆర్, నైనీ కోల్ బ్లాక్, సింగరేణి స్కామ్, సోలార్ పవర్‌స్కామ్, ఎన్‌టీపీసీ థర్మల్ పవర్ స్కామ్, హెచ్‌సీయూ, లగచర్ల భూ స్కామ్, కోటి ఎకరాల భూమి నిషేధిత జాబితా కుంభకోణం, హ్యామ్ రోడ్లు, ఫోర్త్ సిటీ, హిల్ట్–పీ, అక్రమ మైనింగ్ వంటి కుంభకోణాలపై విచారణ జరపాలి. నిష్పక్షపాత విచారణ కోసం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు వెంటనే పదవులకు రాజీనామా చేయాలి. ప్ర జాధనాన్ని రక్షించడం, అవినీతి అక్రమాలను అడ్డు కోవడం రాజ్యాంగబద్ధమైన సీఎంగా మీ బాధ్యత’అని లేఖలో బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం పేర్కొంది.


