సింగరేణి ప్రైవేటీకరణపై బీఆర్‌ఎస్‌ యుద్ధభేరి | Sakshi
Sakshi News home page

సింగరేణి ప్రైవేటీకరణపై బీఆర్‌ఎస్‌ యుద్ధభేరి

Published Fri, Apr 7 2023 3:24 AM

KTR Call For dharna with Singareni workers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి పరిధిలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 8న ‘మహాధర్నా’నిర్వహించాలని అధికార బీఆర్‌ఎస్‌ నిర్ణయించింది. మంచిర్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, రామగుండం, కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రాల్లో ఈ మహధర్నాలు నిర్వహించనుంది. ప్రధాని మోదీ ఈ నెల 8న హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సింగరేణి కార్మికులతో కలసి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారక రామారావు పిలుపునిచ్చారు.

సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించబోమంటూ గతంలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం యూటర్న్‌ తీసుకోవడంపై నిరసన తెలుపుతూ ప్రజాక్షేత్రంలో బీజేపీకి గుణపాఠం చెప్పేందుకే మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. మహాధర్నాకు సంబంధించి సింగరేణి పరిధిలోని జిల్లాల బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో గురువారం కేటీఆర్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. ‘సింగరేణిని ప్రైవేటీకరించబోమని 2022 నవంబర్‌ 12న రామగుండంలో ప్రకటించిన ప్రధాని మోదీ మాట తప్పారు.

వేలంతో సంబంధం లేకుండా సింగరేణికి బొగ్గు గనులు కేటాయించాలని అటు కార్మికులు, ఇటు తెలంగాణ ప్రజలు ముక్తకంఠంతో కోరినా పట్టించుకోవట్లేదు. తాజాగా సత్తుపల్లి బ్లాక్‌ 3, శ్రావణపల్లి, పెనగడప గనుల వేలం కోసం కేంద్రం మరోమారు నోటిఫికేషన్‌ ఇచ్చింది. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియ నిర్వహించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి’అని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 

ప్రైవేటీకరణ కుట్రలపై జంగ్‌ సైరన్‌ 
‘తెలంగాణను దెబ్బకొట్టాలనే దురుద్దేశంతో కేంద్రం చేస్తున్న కుట్రలను వ్యతిరేకిస్తూ సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని సీఎం కేసీఆర్‌ గతంలో కేంద్రానికి లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌ స్టీల్‌ ప్లాంటుకు కూడా గనులు కేటాయించకుండా కేంద్రం దివాలా తీయించింది. అదే విషప్రయోగాన్ని ఇక్కడ అమలు చేయాలని చూస్తే అడ్డుకొని తీరుతాం. గుజరాత్‌ ఖానిజాభివృద్ధి సంస్థకు నామినేషన్‌ పద్ధతిలో లిగ్నైట్‌ గనులను కేటాయించిన రీతిలోనే సింగరేణికి గనులు కేటాయించాలి.

సింగరేణి సంక్షోభంలోకి వెళ్తే దక్షిణాది థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుంది. సింగరేణి ప్రైవేటీకరణ కేవలం 6 జిల్లాల సమస్య కాదు. తెలంగాణ ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే కుట్రలో భాగంగానే జరుగుతోంది. సింగరేణి ప్రైవేటీకరణతో తెలంగాణలో అంధకారంతోపాటు కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారు.

వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాల్లో రిజర్వేషన్లు, ఉద్యోగుల బోనస్‌లు, అలవెన్సులు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా రద్దవుతాయి. ఈ నేపథ్యంలోనే ఈ నెల 8న ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో జంగ్‌ సైరన్‌ పూరించాం’అని కేటీఆర్‌ తెలిపారు. 

10న వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులతో ఏపీ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు భేటీ 
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంపైనా పోరాటానికి బీఆర్‌ఎస్‌ సిద్ధమవుతోంది. స్టీల్‌ ప్లాంటును కార్పొరేట్‌ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందంటూ ఈ నెల 2న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బహిరంగ లేఖ రాసిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ ఏపీ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్‌ ఈ నెల 10న వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాల ప్రతినిధులు, కార్మికులతో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

Advertisement
Advertisement