Sakshi News home page

ఆ 811 టీఎంసీలు.. ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ

Published Sat, Oct 7 2023 5:06 AM

krishna water 811 tmc between ap telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కృష్ణా ట్రిబ్యునల్‌–1 (బచావత్‌ ట్రిబ్యునల్‌) గంపగుత్తగా కేటాయించిన 811 టీఎంసీలను.. తిరిగి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అంతర్రాష్ట నదీ వివాదాల చట్టం (ఐఎస్‌ఆర్‌డీఏ)–1956లోని సెక్షన్‌ 3, సెక్షన్‌ 5(1), 12ల కింద జస్టిస్‌ బ్రిజేశ్‌కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌–2కు మరిన్ని విధి విధానాలను జారీ చేస్తూ శుక్రవారం కేంద్ర జలశక్తి శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

పోలవరం ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలిస్తే, దానికి ప్రతిగా నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీల కృష్ణా జలాలను వాడుకోవడానికి గతంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం ఈ నీటిని సైతం రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలని కేంద్రం తాజా విధివిధానాల్లో స్పష్టం చేసింది. ఈ క్రమంలో 80 టీఎంసీల్లో ఏ రాష్ట్రం వాడుకోని 45 టీఎంసీలను కృష్ణా ట్రిబ్యునల్‌–2 కొత్తగా రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయనుంది.

దీంతో మొత్తంగా 856 టీఎంసీల కృష్ణా జలాలు ఉభయ రాష్ట్రాల మధ్య పంపిణీ కానున్నాయి. రెండు రాష్ట్రాలకు నీటి పంపకాలపై తుది నివేదిక సమర్పించడానికి గతంలో కృష్ణా ట్రిబ్యునల్‌–2కు ఉన్న గడువును 2024 మార్చి 31 వరకు కేంద్రం పొడిగించింది. ఇప్పుడు అదనపు విధివిధానాలను ప్రకటించినా.. గడువు పొడిగింపు ఏదీ వెల్లడించలేదు. దీనితో వచ్చే ఏడాది మార్చి 31లోగా ట్రిబ్యునల్‌ తుది నివేదిక ఇవ్వాల్సి ఉండనుంది.

ఇక ప్రాజెక్టులన్నింటికీ కేటాయింపులు
తెలంగాణ రాష్ట్ర విజ్ఞప్తి మేరకు.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్మాణం పూర్తైన ప్రాజెక్టులతోపాటు నిర్మాణంలో ఉన్న, ప్రతిపాదన దశలోని ప్రాజెక్టులకు సైతం ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాలను పంపిణీ చేయాలని తాజాగా కృష్ణా ట్రిబ్యునల్‌–2కు కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89లోని క్లాజులు 89(ఏ), 89(బీ)లోని ‘ప్రాజెక్టుల వారీగా’ అనే పదానికి ఈ మేరకు విస్తృత అర్థాన్నిస్తూ తాజా గెజిట్‌ నోటిఫికేషన్‌లో నిబంధన చేర్చింది. దీంతో తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులకు సైతం ట్రిబ్యునల్‌ నీటి కేటాయింపులు జరిపే అవకాశం ఉంది.

Advertisement
Advertisement