ఆ ప్రాజెక్టులపై ముందుకెళ్లొద్దు

Krishna Board Directives to Both the AP, Telangana States - Sakshi

ఇరు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు ఏ ప్రాజెక్టులు చేపట్టాలన్నా సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డు అనుమతి తీసుకోవాలని, అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టు పనులను తక్షణం నిలిపివేయాలని ఇరు రాష్ట్రాలను కృష్ణా బోర్డు ఆదేశించింది. విభజన చట్టం ప్రకారం అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి, భక్తరామదాస, తుమ్మిళ్ల, మిషన్‌ భగరీథ, సామర్థ్యం పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్సెల్బీసీ (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ) పనులను ఆపేయాలని తెలంగాణ సర్కార్‌ను కృష్ణా బోర్డు ఆదేశించింది. ఆ ప్రాజెక్టుల పనులపై ముందుకెళ్లొద్దని ఆదేశిస్తూ తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్‌కు కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి డీఎం రాయ్‌పురే మంగళవారం లేఖ రాశారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా బేసిన్‌లో ఇరు రాష్ట్రాలు కొత్తగా ఏ ప్రాజెక్టును చేపట్టాలన్నా సీడబ్ల్యూసీ, కృష్ణా బోర్డుకు ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను పంపి అపెక్స్‌ కౌన్సిల్‌ ఆమోదం తీసుకోవాలని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా చేపట్టిన ప్రాజెక్టుల ద్వారా 178.93 టీఎంసీలను తరలించడానికి తెలంగాణ సర్కార్‌ ప్రయత్నిస్తోందని, వాటి వల్ల తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని గతేడాది మే 14న ఏపీ జలవనరుల శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కృష్ణా బోర్డుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. దాంతో ఆ 8 ప్రాజెక్టులను ఆపేయాలని తెలంగాణ సర్కార్‌ను మే 30న బోర్డు ఆదేశించింది. గతేడాది అక్టోబర్‌ 6న అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ నిర్వహించారు. ఆ 8 ప్రాజెక్టులను ఆపేయాలని మరోసారి సూచించారు. అయినప్పటికీ ఆ పనులను కొనసాగిస్తుండటంపై గత నెల 30న కృష్ణా బోర్డు దృష్టికి ఏపీ ఈఎన్‌సీ నారాయణరెడ్డి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కృష్ణా బోర్డు, తక్షణమే ఆ 8 ప్రాజెక్టుల పనులను ఆపేయాలంటూ తెలంగాణ సర్కార్‌ను తాజాగా ఆదేశించింది. 
ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ఈఎన్‌సీ ఫిర్యాదు 
ఏపీ ప్రభుత్వం అనుమతి లేకుండా చేపట్టిన తోపుదుర్తి, ముట్టాల, దేవరకొండ, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్లు, కొత్తపల్లి, ఆత్మకూరు, బాల వెంకటాపురం, మద్దెలచెర్వు ఎత్తిపోతల పనులను తక్షణమే నిలుపుదల చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని కృష్ణా బోర్డు ఆదేశించింది. ఈ మేరకు ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డికి కృష్ణా బోర్డు సభ్యులు హరికేశ్‌ మీనా మంగళవారం లేఖ రాశారు. జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి వైఎస్సార్‌ అప్పర్‌ పెన్నార్‌ ఎత్తిపోతల్లో భాగంగా తోపుదుర్తి, ముట్టాల, దేవరకొండ, సోమరవాండ్లపల్లిల వద్ద నిర్మించే రిజర్వాయర్లను నింపడంతోపాటు ఎగువ పెన్నార్‌ జలాశయాన్ని నింపి ఆయకట్టుకు నీళ్లందించే పనులను ఏపీ అనుమతి లేకుండా చేపట్టిందని డిసెంబర్‌ 19న తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్‌  బోర్డుకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కృష్ణా బోర్డు ఆ 8 ప్రాజెక్టుల డీపీఆర్‌లు ఇవ్వాలని ఏపీకి సూచించింది.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top