రైతుల ఉద్యమానికి అవసరమైతే కేసీఆర్‌ నాయకత్వం 

KCR Will Support Farmers Movement Says Srinivas Yadav - Sakshi

మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఉద్యమానికి అవసరమైతే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నేతృత్వం వహిస్తారని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. బిల్లును రైతాంగం వ్యతిరేకిస్తున్నా రాజ్యసభలో చర్చించకుండా మూజువాణి ఓటుతో ఆమోదించడాన్ని తలసాని ప్రశ్నించారు. ప్రభుత్వ విప్‌ ఎం.ఎస్‌.ప్రభాకర్, హైదరాబాద్‌ నగర ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్‌తో కలిసి సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులతో పెట్టుకున్న వారెవరూ బాగుపడలేదని, బిల్లును వ్యతిరేకిస్తూ అకాళీదల్‌కు చెందిన కేంద్ర మంత్రి రాజీనామా చేసినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కూడా వ్యవసాయ బిల్లు ఇష్టం లేనందునే సోమవారం సభలో లేరని శ్రీనివాస్‌ యాదవ్‌ చెప్పారు. మతం, కాశ్మీర్‌ పేరిట బీజేపీ చేస్తున్న రాజకీయాలు సాగబోవని, దేశంలో విప్లవం మొదలైందని హెచ్చరించారు. 

డెయిలీ సీరియల్‌లా మాట్లాడం 
డబుల్‌ బెడ్రూం ఇళ్లపై కాంగ్రెస్‌ నేతల విమర్శలపై డెయిలీ సీరియల్‌లా మాట్లాడదలుచుకోలేదని మంత్రి అన్నారు. హైదరాబాద్‌లో స్థలం లేనందునే నగర శివార్లలోని 111 ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. అసెంబ్లీ ఎదుట ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నాగులు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top