అవమానించిన ప్రతిసారి గాంధీనే తలచుకున్నా: సీఎం కేసీఆర్‌

KCR Slams BJP On Occasion Of Gandhi Jayanti - Sakshi

మరుగుజ్జులు ఎన్నటికీ మహాత్ములు కాలేరు

దేశంలో జవాన్‌ అగ్నిపథ్‌లో కాలుతుంటే.. కిసాన్‌ మద్దతుధర లేక నలిగిపోతున్నాడు 

గాంధీజీనే కించపర్చేలా కొన్ని చిల్లర శక్తుల వెకిలి ప్రయత్నాలు 

‘గాంధీ’ మహాత్ముడి విగ్రహావిష్కరణలో సీఎం వ్యాఖ్యలు 

రాష్ట్రంలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు ప్రేరణ గాంధీజీయేనని వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘ప్రపంచానికి శాంతి, సౌభ్రాతృత్వాలను అందించిన మహనీయుడు మహాత్మాగాంధీ. అలాంటి మహాత్ముడిని కించపరిచేలా సమాజాన్ని చీల్చే కొన్ని చిల్లరమల్లర శక్తులు ప్రయత్నాలు చేస్తున్నాయి. అవి విన్నప్పుడల్లా హృదయం బాధపడుతుంది. వారి వెకిలి ప్రయత్నాల వల్ల మహాత్ముడి ప్రభ తగ్గదు. మరుగుజ్జులు ఏనాటికీ మహాత్ములు కాలేరు.

వెకిలిగానే చరిత్రలో మిగి లిపోతారు..’’అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొ న్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం బయలుదేరిన తనను కూడా చాలా మంది ఎగతాళి చేసేవారని గుర్తు చేసుకున్నా రు. ఈ బక్కపల్చటోడు ఏం చేస్తాడు, వీడితో ఏం అవుతుందని అవహేళన చేశారని.. అలాంటి సమయంలో తాను కళ్లుమూసుకుని మహాత్మా గాంధీని స్మరించుకునే వాడినని చెప్పారు. గాంధీజీ స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలకు ప్రేరణ మహాత్ముడేనన్నారు. గాంధీ ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన 16 అడుగుల మహాత్ముడి కాంస్య విగ్రహాన్ని కేసీఆర్‌ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. 

మేధావులు మౌనం పాటించొద్దు 
నిస్వార్ధ సేవాపరుడు, మాజీ ప్రధాని లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతి కూడా గాంధీ జయంతి రోజునే అని కేసీఆర్‌ గుర్తుచేశారు. ఈ దేశాన్ని రక్షించేవాడు జవాన్‌ అయితే, అన్నం పెట్టేవాడు కిసాన్‌ అనే గొప్ప నినాదం ఇచ్చిన గొప్ప వ్యక్తి ఆయన అని కొనియాడారు. కానీ ఈ రోజు మన కళ్లముందు ఏం జరుగుతుందో మేధావులు గమనించాలని.. మౌనం పాటించొద్దని కోరారు.

తప్పును విమర్శించి, మంచిని ప్రోత్సహించినప్పుడే ఈ సమాజం ఆరోగ్యంగా ముందుకెళుతుందన్నారు. ఇప్పుడు దేశంలో జవాన్‌ అగ్నిపథ్‌లో కాలిపోతుంటే.. కిసాన్‌ మద్దతు ధర లేక కృషించిపోతున్నాడని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. మేధావి లోకం ముందుకొచ్చి దీనిని ఖండించాలన్నారు.  

అందరికీ ఆయన ఆదర్శం. 
ఎన్నో కులాలు, మతాలు, జాతులు, భాషలు, భిన్న సంస్కృతులు ఉన్న దేశంలో ప్రతి ఒక్కరిలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించి.. నడిపించిన సేనాని మహాత్మాగాంధీ అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. ఆయన చేసిన ప్రతిపని, చెప్పిన ప్రతి మాట ఆచరణీయమే అన్నారు. నెహ్రూ, వల్లబ్‌భాయ్‌ పటేల్, మౌలానా అబుల్‌ కలాం ఆజాద్, సుభాష్‌ చంద్రబోస్‌లతోపాటు మార్టిన్‌ లూథర్‌కింగ్, దలైలామా, నెల్సన్‌ మండేలా వంటి ప్రపంచ నేతలకూ మహాత్ముడే ఆదర్శమని చెప్పారు. మహాత్మా గాంధీ పుట్టి ఉండకపోతే తాను అమెరికా అధ్యక్షుడిని అయ్యేవాడిని కాదని బరాక్‌ ఒబామా పేర్కొన్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేశారు. 

కరోనా మహమ్మారిపై ‘గాంధీ’యుద్ధం! 
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి కాలంలో మన రాష్ట్రంలో అత్యంత ధైర్యంగా ప్రజల ప్రాణాలను కాపాడిన ఆరోగ్య సంస్థ గాంధీ ఆస్పత్రి అని సీఎం కేసీఆర్‌ కొనియాడారు. ఇక్కడి వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది గాంధీ ఆదర్శాన్ని పుణికి పుచ్చుకుని.. ప్రజలకు సేవలు అందించారని చెప్పారు.

ప్రైవేట్‌ ఆస్పత్రులు కరోనా రోగులను తిప్పిపంపితే.. గాంధీ ఆస్పత్రి అక్కున చేర్చుకుని వేలాది మంది ప్రాణాలను కాపాడిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, జీవన్‌రెడ్డి, ముఠాగోపాల్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ సురభి వాణి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top